పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశకునివిజ్ఞప్తి

విమర్శకాగ్రేసర, ఐతిహాసికసమ్రాట్, ధర్మభూషణ, ఇత్యాదిబిరుదాంకితు లగు శ్రీ పండిత బండారు తమ్మయ్యగారు నిస్స్వార్థముగఁ జిరకాలమునుండి సాగించుచున్న శైవవాఙ్మయసేవను గుర్తించని యాంధ్రు లుండరు. వారి విమర్శవ్యాసములు పలుపత్రికలలోఁ జిరకాలముగఁ బ్రకటితము లయినవి. ప్రఖ్యాతాంధ్రవీరశైవకవిసార్వభౌముఁడు పాలకురికి సోమనాథుని ద్విపద బసవపురాణమును, అనుభవసారమును, శ్రీనాథుని భీమేశ్వరపురాణమును భాషోద్ధారక వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రిగారు తమ్మయ్యగారిచేతనే పరిష్కరింపించి వారిపీఠికలతోఁ బ్రకటించియుండుట పలువు రెఱింగియేయుందురు. సోమనాథుని లఘుకృతులు పంచప్రకారగద్య మొదలగు వాని నెన్నింటినో తమ్మయ్యగారే ఆంధ్రపత్రిక సంవత్సరాదిసంచికలు, ఆంధ్రసాహిత్యపరిషత్పత్రికసంచికలు మున్నగువానిలోఁ బ్రకటించియున్నారు. సోమనాథుని లఘుకృతులనన్నిటి నొకప్రత్యేకసంపుటముగఁ బ్రకటించు నావశ్యకతను గుర్తించి నేను శ్రీ తమ్మయ్యగారి నిందుఁ గూర్చి యర్థింపఁగా నీకార్యము నింతకుమున్నే యాంధ్రసాహిత్యపరిషత్పక్షమున నిర్వహింపఁ దాము సంకల్పించితి మనియుఁ గాని యింతవఱ కది జరుగలేదనియు నిట్టి ప్రత్యేకసంపుటమును వెలువరించుట యావశ్యకమే యనియు వారును నన్ను హెచ్చరించిరి. కాని సోమనాథుని కృతులలోఁ బేరెన్నికఁగన్న చతుర్వేదసార మొకసారి యిదివఱలో 1914 సంవత్సరమున నేదోవిధముగ ముద్రిత మగుటయేగాని యింతవఱకు మరలఁ బరిష్కృతమయి, ప్రకటితము కాలేదనియు, లఘుకృతులసంపుటమునకు ముందుగా నీచతుర్వేదసారమును. బ్రకటించుట మంచిదనియు సూచించిరి. అందుపయి నేను