పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11

నామిత్రులు కొందఱతో సంప్రతించి వారి నీసత్కార్యనిర్వహణమునకయి ప్రోత్సహింపఁగాఁ బరమేశ్వరప్రేరణమున భూరివిరాళములతో వా రిందుకుఁ దోడ్పడిరి. ఆమహనీయుల నామము లిందుఁ బ్రకటితము లయినవి. వారి సాహాయ్యమూలముననే యీగ్రంథ మిట్లు ప్రకాశమొందఁగల్గినదని మనవిచేయుచున్నాను. భక్తావనతత్పరుండగు పరమేశ్వరుండు నిరంతర మీపుణ్యపురుషుల కవిరళాయురారోగ్యైశ్వర్యాభ్యుదయములఁ బ్రసాదించుఁగావుత మని ప్రార్థించుచున్నాను. ఈసందర్భమున నాతోపాటు కృషియొనర్చిన శ్రీ రాచంశెట్టి బసవనాగయ్యగారికి నాకృతజ్ఞతాభివందనములు. ఆరోగ్యము లేక దెబ్బదవపడిలోఁ గృశించుచున్నను సహజభాషాభిమానమతాభిమానములను సోమనాథునియెడఁ గల సమధికభక్తిని బురస్కరించికొని విశేషశ్రమతో నీగ్రంథమును బరిష్కరించి ప్రకటించిన శ్రీ తమ్మయ్యగారికి దీర్ఘాయురారోగ్యముల ననుగ్రహించి యుమామహేశ్వరులు సోమనాథుని లఘుకృతులసంపుటముగూడఁ ద్వరలో వారి పరిష్కరణముననే ప్రకటితమగు భాగ్యమును ఘటించుఁగాత మని ప్రార్థించుచున్నాను.

వల్లూరుపాలెము

ఇట్లు, భక్తవిధేయుఁడు,

1-2-1962

చలవాది రాచయ్య