పుట:కాశీమజిలీకథలు -01.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేపనవ్విన కథ

305

అప్పుడు మంత్రి నురికంబమునొద్ద నిలువఁబెట్టిరి. కొందరు పెద్దమనుష్యులు దాపుగా నిలువంబడిరి. మంత్రి భార్య యేడ్చుచు మగని యడుగుల మ్రోలఁబడి యుండెను. చూచు వారందరు కన్నీరు గార్చుచుండిరి. రాజకింకరులు దండనాథునితో అయ్యా! మంత్రి నుఱిదీయుట కనుజ్ఞా? యని యడిగిన నతండు చేయి వీచి యాజ్ఞ యిచ్చెను. అందఱు హరినామస్మరణ చేయుచుండిరి.

పిమ్మట నతని తల నురిత్రాటిలోఁ దగిలించిరి. ఇంతలో నా పక్షులు రెక్కల గాలి చప్పుడువిని యందరు నద్భుతమందుచు నా దిక్కుగాఁ జూచిరి. అంత నాపక్షులు రెండును వారిమ్రోల వ్రాలినవి. అప్పుడు ప్రద్యుమ్నుఁడు లేచి చేయెత్తి యోహో! మంత్రి నుఱిదీయకుఁడు ఉరిదీయకుఁడని కేకలు పెట్టెను. ఆ ధ్వనిని విని యురిదీయువారలు భయపడి మంత్రి శిరస్సును ద్రాటిలోనుండి తప్పించిరి. అక్కటి యధికారి ప్రద్యుమ్నునితో నోయీ! మంత్రి నురిదీయవలదని నిర్భయముగాఁ బలుకుచుంటివి. నీ వెవ్వఁడవు. నీకేమి యధికారమున్నది? నీవు చేఁప నవ్విన కారణము జెప్పఁగలవా యని యడిగినఁ బ్రద్యుమ్నుం డిట్లనియె.

అయ్యా! నేను మంత్రికుమారుండను నా పేరు ప్రద్యుమ్నుఁడు. నేను చేఁప నవ్విన కారణము నిశ్చయముగాఁ జెప్పఁగలను. మంత్రి నురి తీయింపకుఁడు అని చెప్పెను. ఆ మాటలువిని యెల్లరు సంతోషించిరి అప్పుడు దండనాథు డా వార్త రాజునొద్దకు బోయి చెప్పెను. రాజు నురిదీయువారితోఁ బ్రద్యుమ్నుమాట వినువఱకు మంత్రి నురిదీయవలదవి యాజ్ఞాపించి వారినెల్ల రప్పించుకొని ప్రద్యుమ్నా! చేఁప నవ్విన కారణము చెప్పఁగలవా! నీ తండ్రిని విడిపింతు ననుటయు నతం డయ్యా! యా కారణము తప్పక చెప్పెదను. సభ చేయింపు డనుటయు సింహధ్వజుఁ డప్పుడే పౌరులనెల్ల దన యాస్థానమునకు వచ్చునట్లాజ్ఞాపించెను. సామంత నృపాల పౌర పండితయుతుండై యా నృపాలుండు పెద్దకొలువుదీర్చి కూర్చుండెను.

అచ్చటికి లవంగియు, బ్రద్యుమ్నుఁడు, జయసేనుఁడు, రత్నాంగియు వచ్చి యుచితస్థానముల గూర్చుండిరి. మంత్రినిఁగూడ నచ్చటికి రప్పించిరి. కొలువువారెల్ల ప్రద్యుమ్నుని యుపన్యాసమును వినగోరుచున్న సమయంబున రాజు ప్రద్యుమ్నునికిఁ జేప నవ్విన కారణమును జెప్పుటకు సెలవిచ్చెను. అప్పుడు ప్రద్యుమ్నుఁడా వార్త జెప్పుటకుఁ దన ప్రక్కనున్న లవంగివి నియోగించెను. అంత నా నెలఁతయు బతి యనుమతి వడసి లేచి నిలువంబడి సభాసదులకు నమస్కరించి యెల్లరు విన రాజుతో నిట్లనియె. రాజా! భగవంతుడు పశుపక్షిమృగాదికముల కేదియో యొకశక్తి పరి