పుట:కాశీమజిలీకథలు -01.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

304

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మరచియే పోయితిమి. ఆయన బ్రతికియుండిన మనలజూచి సంతోషించునుగదా! అతండు లేనినాఁడు మనలనుజూచి సంతసించువారెవ్వరు? ఇందులకై నాకు విచార మగుచున్నది. యేమి చేయవలయునని పలికిన విని యక్కలికి యన్నా! అందులకై నీవు చింతింపకుము. మనతండ్రి బ్రతుకుమార్గము దేవకన్య లాడుకొనిన మాటలచే దేటపడినది. చేప నవ్విన కారణము నేను జెప్పగలను. కాని లెక్కించిచూడ నేటి సాయంకాలమే మన తండ్రిని నురిదీయు సమయము. ఈ దివసముతో నారుమాసము లైనది ఇంతలో నింటికెట్లు పోగలము. మనగ్రామ మేదిక్కున నున్నదో మన మెఱుగము. దీని కేదియేని యాధారమున్న జెప్పమనిన నతం డిట్లనియె. అమ్మాణీ! ఆ కారణము యథార్ధముగా నీకు దెలిసినచో నేనీ సాయంకాలము లోపుగా మనము మన గ్రామము చేరునట్లు చేయగలను. చూడుమని యప్పు దాత్మగతంబున బూర్వము వరమిచ్చిన బైరవపక్షులం దలంచుకొనియెను.

అంతమాత్రముననే యా పక్షులువచ్చి ముందు వ్రాలినది . దానిం జూచి ప్రద్యుమ్నుడు సంతసించుచు దనకథ యంతయుం చెప్పి సాయంకాలము లోపుగా దమ్ముఁ దమపురమును జేర్చుఁడని వేడుకొనియెను అప్పుడా పక్షులు చెరియొక యిద్దరిని దమ రెక్కలమీఁద నెక్కించుకొని గరుత్మంతుడుబోలె నతిరనంబునఁ బ్రొద్దు గ్రుంకక పూర్వమే మిక్కిలి దవ్వుగానున్న ధర్మాపురమునకుఁ దీసికొని పోయినవి.

ఆహా! వాని గమనవేగ మెట్టిదో చూడుము. అప్పుడా గ్రామ మంతయు హల్లకల్లోలముగా నున్నది. వీధుల గుంపుగుంపులుగా జనులు గూడికొని మంత్రి మాటలు చెప్పుకొనుచుండిరి. ఆయ్యో! ఈ మంత్రికెట్టి యాపద వచ్చినదో చూచితిరా ? యుఱికంబము నొద్దకుఁ దీసికొనిపోయిరి. కొడుకును గూఁతురను గూడ నారు మాసముల క్రిందట దేశాంతర మేగిరఁట వారు దగ్గరలేరు. పాపము భార్య యొక్క రీతియ యా బండి వెనుక నేడ్చుచుఁ బోవుచున్నది. వారేమైపోయిరో తెలియదు. రాజెంత దయాశూన్యుఁడో కాని యతని కొడుకును కూఁతురు నింటికి వచ్చు వరకైన నిలుపరాదు గాఁబోలు. పాపమా మంత్రి నీకేమి కోరిక యున్నదని యడిగిన దన సంతానముఁ జూడఁ గోరికొనియెనఁట. రాజుగారు దానికి సమ్మతింపలేదు. అయ్యో! తుదకు వాని కపరక్రియ జేయువారు గూడ లేరుగదా యని యనేకరీతులఁ బ్రజలు చెప్పుకొనఁ దొడంగిరి. ఆ మాటలన్నియు నాలించుచుఁ బ్రద్యుమ్నుఁడు లవంగియుఁ దిన్నగా నా యురికంబము నొద్దకే యా పక్షుల నడిపించిరి.