పుట:కాశీమజిలీకథలు -01.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

పూర్ణముగా నిచ్చి మనుష్యకోటికి సకలవిధజ్ఞానశక్తియు నొసంగెను. అట్టి మనుష్యజాతియందు జనియించియు గూడని కార్యములయందుఁ బ్రవర్తించు యుక్తాయుక్తవివేకశూన్యులగు మనుష్యులకంటె నితరజాతియే నీతిగలదని చెప్పవచ్చును. పిపీలికాజ్ఞానము విహంగజ్ఞానము పశుజ్ఞానము జలచరజ్ఞానము మనుష్యజ్ఞానమునకు మించి యొప్పును. ఆ చేప యూరక నవ్వినదికాదు. అందుకు మంచికారణమే యున్నది. దానిం జెప్పుమని మీరు మంత్రికి నాజ్ఞాపించిరి. ఆయనకు మారుగాఁ గొమార్తెను నేను జెప్పుచుంటిని. ఆ కారణము వినిన మీకుఁ గోపము రాకమానదు. అందుమూలమున నన్నపరాధినిగా నెంచితరేని రెండవ యుపద్రవము సంప్రాప్తించఁగలదు. రాజాజ్ఞ యెట్టిదైన నడ్డుచెప్పు వారుండరు. కావున నది యెట్టిదైనను క్షమింతుమని నా కభయపత్రిక నిత్తురేని వక్కాణించెద. లేకున్నఁ జెప్పనేరనని సహేతుకముగాఁ బలికిన విని యా నరేంద్రుఁడు తదీయు గంభీరోపన్యాసమునకు సిగ్గుపడుచు నిట్లనియె.

ధరుణీ! చేఁప నవ్విన కారణము నిదర్శనముగాఁ జెప్పితివేని యెంత యపరాధమైన సైరించెద నందులకు సందియ మక్కరలేదు. చెప్పుము చెప్పుమని తొందర జేయుచు నట్టి పత్రిక వ్రాసియిచ్చెను. అప్పుడా చిన్నది, మహారాజా! పురుషులకంటె స్త్రీలకు సాహసము కామము మొదలగు గుణము లారు రెట్లధికమని శాస్త్రములు జెప్పుచున్నవి. వనితలు పరపురుషసంగమాభిలాషినులనికదా? తరుచు నంతఃపురములోఁ బెట్టి కాపాడుచుందురు.

శ్లో॥ నగృహాణీ నవస్త్రాణి నప్రాకార స్స్తిరస్క్రియాః
     నేదృశారాజ సత్కారావృత్తమాభరణం స్త్రీయాః॥

అంతఃపురములును వస్త్రములును ప్రాకారములును తెరలును రాజసత్కారములును స్త్రీల కాభరణములై కాపాఁడజాలవు స్త్రీకి సద్వృత్తమే మంచియాభరణము యని వాల్మీకి చెప్పియున్నాఁడు. నీవు నీ భార్యల ననేక రక్షకభటరక్షితంబులగు నంతఃపురంబులంబెట్టి పోతుటీగనేనియుఁ జొరనీయక పాపాడుచుంటివి. వారు సచ్ఛీలలై యున్న వారనియే తలంచుచుంటివి.

అల్లనాడు పల్లెవాండ్రు చేఁపను దీసికొనివచ్చినప్పుడు దాని నంతఃపురమునకుఁ బంపదలంచి యది యాఁడుదియా మగదియా యని యడిగితివి. అది మగది యేయైనచో మీ భార్యలకు మానహాని వాటిల్లుననియేకదా తలంచితిరి మీ ప్రశ్నకారణ మామత్స్యశ్రేష్టంబు గ్రహించి పక్కున నవ్వినది. ఇదియే చేఁప నవ్విన కారణమని పలికిన విని యా రాజు తల కంపించుచు నిట్లనియె.