పుట:కాశీమజిలీకథలు -01.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అప్పుడా ప్రద్యుమ్నుడు చీఁకటిబాసి వెలుఁగువచ్చినది కావున నా వెలుతురున నానవాలు పట్టి యోహో! నా ప్రాణనాయకియగు రత్నాంగియే యని యవ్వనితను మరల గౌఁగలించుకొని బోఁటీ! నీ విచ్చోటి కెట్లు వచ్చితివి? అన్నా దైవఘటన మిట్టిది కాఁబోలు స్వాగతమేనా? యని యడిగిన నారత్నాంగి మగని కిట్లనియె.

నాథా! వినుఁడు మీరట్లు నన్నాతటాకములో విడిచి మాణిక్యమునకై పక్షి వెంట నరిగిన వెనుక మీరాకకై కొంతసేపు నేనా నీరాకరతీరంబున వేచియుంటిని ఎంత తడవునకు మీరు రాకపోవుటచేఁ బరితపించుచు మీరు బోయిన దారింబట్టి నడచుచుఁ బ్రద్యుమ్నా! యని యరచుచు మిమ్ము వెదికితిని. ఎందునను మీ జాడ దెలిసినదికాదు. అంతరాత్రి పడినది. కటికచీఁకటిలో గుండె రాయిచేసుకొని బ్రతుకు మీఁది యాశవదలి యొక చెట్టుక్రిందఁ బండుకొంటిని ఆ రాత్రి యేమియు నిద్రపట్టినదికాదు. అంతఁ దెల్లవారిన వెనుక మరలఁ నయ్యడవిలో మిమ్ము వెదకుచు నడుచు చుంటిని. ఈరీతి మూడురాత్రులు వెదకినను మీజాడ తెలిసినదికాదు.

అంత నాలుగవనాఁడు రాత్రి యక్కానలో మీకై చింతించుచున్న నా రొద విని దొంగలు వచ్చి నన్నుఁ బట్టుకొనిరి అప్పుడు నాకుఁ బ్రాణముమీఁద యాశవదలినది. స్మృతితప్పి మూర్ఛనొందితిని. పిమ్మట నామ్రుచ్చులు నన్నేమి చేసిరో నే నెఱుంగను. జాముక్రిందట నీ పుణ్యాత్ముఁడు వారింజంపి నన్ను విడిపించెను. ఈతనితో నీ గుడిలోనికి వచ్చి యీ రోగివద్దఁ గూర్చున్న వెంటనే మీరు తటాకములోఁ బడితిరి. ఇదియే నా వృత్తాంతము. మిమ్మును నన్నును నాపత్సముద్రమునుండి దరి జేర్చిన యీ పుణ్యాత్ముని వృత్తాంతమెట్టిదో తెలిసికొనఁదగినదై యున్నదని పలికిన నా ప్రద్యుమ్నుఁ డాబాలయోగికి నమస్కరించి యయ్యా! మీరు మమ్ముద్ధరింపవచ్చిన పరమేశ్వరులని తోచుచున్నది. మీ యభిదానవర్ణంబులం జెప్పి మదీయశ్రవణానందము గావింపుఁడని యడిగిన నవ్వుచు నాబాలసన్యాసి యిట్లనియె.

అయ్యా! మీ చరిత్రము వినిన నాకును మీతో బంధుత్వము గలిగినట్లేయున్నది. నేను మత్స్యదేశపు రాజకుమారుండను. నా పేరు జయసేను డందురు. నే నొక్కనాఁడు వేటకుఁబోయి గాలివానచే సేనలను విడిచి యొక్కరుండ గుఱ్ఱముతోఁ జీఁకటిలో దారితప్పి యొక మఱ్ఱిచెట్టు క్రిందకుఁ బోయితిని. అందొకసుందరి మెఱుపుల వెల్తురు నన్నుఁ జూచి అన్నా! ప్రద్యుమ్నా యిటురా! యని కేకలు పెట్టెను. దానికి నేను అదరిపడి దరికరిగితిని. ఆ చిన్నది నేను ప్రద్యుమ్నుఁడనే యనుకొని తటాలున వచ్చి కౌఁగలించుకొనినది. అప్పుడు కాంతా! నేను ప్రద్యుమ్నుఁడను కాను. నా పేరు జయసేనుఁడని నా యుదంతమంతయుఁ జెప్పితిని. పిమ్మట నమ్మదవతియుఁ దన యుదంతమంతయు జెప్పి యన్నకై చింతింపఁ దొడఁగినది.