పుట:కాశీమజిలీకథలు -01.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేపనవ్విన కథ

301

వ్రాలినది. అప్పుడు నేను భయపడుచు భైరవపక్షి మాట దలంచుకొన తటాలున లేచి రత్నాంగికి జెప్పక యది వ్రాలియున్న చెట్టుక్రిందకిఁ బోయితిని. ఆ గద్దయు నన్నుఁజూచి బెదరి మరల నెగిరి వేరొకమ్రానుపై వ్రాలినది. నేనును దాని చెంతఁ బోయితిని. ఈరీతి నా పతంగ మొకచెట్టు మీఁదనైనను నిలువక రాత్రింబగళ్ళు నడుచుచు నన్నుఁ బెద్దయుం దవ్వు దీసికొనిపోయినది నాకప్పుడు మాయాకురంగము వెంటనేగిన శ్రీరాముఁడు జ్ఞాపకము వచ్చెను. అవి వెన్నెలరాత్రు లగుట రాత్రిగూడ దాని విడువక వెంటనంటి యరిగితిని. అంత నది నాల్గవదినము సాయంకాలమున నయ్యడవిలో నుద్యానవనమందున యొక మేడమీఁద వ్రాలినది. దానింజూచి నేను జనరహితమగు నా సౌధంబులోనికి మెల్లనబోయి యాపక్షి చెంత జేరితిని. మరల నాగద్ద తద్దయు వేగముగా నెగరబోవునంతలో దానికాలి పట్టువదలి యామణి యందు జారిపడినది.

అప్పుడు పట్టరాని యానందముతో నా మాణిక్యమును గైకొని నేనా రత్నంగినిఁ దలంచుకొని యెంతదూరము వచ్చితినో తెలిసికొనలేక మిగులఁ జింతించితిని. నేను మిగుల నాకలి గొనియుంటిని గాన నా మేడలో నలుమూలల వెదకితిని అందాహారపదార్ధములు లనేకములు గనంబడినవి. వానిచేఁ గొంత యాకలి యడంచుకొని పైగదిలోనికిఁ బోయితిని. అందొక హంసతూలికాతల్పంబునఁ బదియారేడుంప్రాయముగల కలకంఠి యొకతె నిద్రింపుచున్నది. దానిఁజూచి నేను వెరగుపడి యోహో! యింత సోయగముగల యెలనాగ ఈ మేడలో నేకాంతముగా నుండుటకు గారణమేమియో గదా? యని తదీయరూపవైభవమంతయు వర్ణించుచు పెద్దతడ వక్కడనే నిలువంబడి చూచుచుంటిని.

ఇంతలో నానెలంత మేల్కొని యెదుర నన్నుఁజూచి పండ్లు పటపట గొరుకుచు చీ యీ మనుష్యులకు సిగ్గులేదు. ఎంత చేసినను మరల వచ్చుచుందురని పలికి నేనుఁ జూచుచుండ దను మేను పెంచి మహా యాగ్రహముతో నాకాళ్ళు రెండును గైకొని గిరగిర ద్రిప్పి విసరవైచినది.

అప్పుడు నామేను తెలిసినదికాదు. ఆ విసరున వచ్చి యీ తటాకములోఁ బడితిని. నీటిలోగాక మఱియొక చోటఁ బడితినేని బ్రాణములే పోవును. ఇందె నను నీ దయామూలముగా బ్రతికితిని. ఇదియే నా వృత్తాంతము. అట్టిసోదరిం బాసితిని. రత్నాంగితో వియోగమును బొందితిని. తండ్రినిం బ్రతికించుకొనలేక పోయితిని. ఇట్లు నేను బ్రతికియు నేమి లాభమని పలుకుచుఁ గన్నీరు విడిచెను. అతని చరిత్ర మంతయు విని లవంగియు మేనుగరుపార దేవకన్యకల పలుకులు దలంచుకొని అన్నా! వచ్చితివే యని మనంబున సంతసించుచుఁ దనగుట్టు బయలుపెట్టక యున్నవారివృత్తాంతము గూడ దెలిసికొనఁ దలంచి యూరకుండెను. అప్పుడు దొంగలచేఁ జెరదేఁబడి బాలయోగిచే విడిపింపబడిన చేడియ యతనికథ యంతయు విని యదిరిపడి హా! నాథా! వచ్చితివే యని యతనిం గౌగలించుకొనియెను. దానికి బాలయోగి వెరగుపడెను.