పుట:కాశీమజిలీకథలు -01.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

300

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

దలంచుకొనుచు నే నిందు వేచియుండ నేఁటికి మీరట్లు వచ్చిరి. నేను గృతకృత్య నై తిని. గాంధర్వవివాహంబున నన్నుంస్వీకరించి భోగపరుండవై యీ యుద్యానవనంబునఁ గ్రీడింపుమనుటయు నా మాటకు సంతసించి యమ్మించుబోఁడి నప్పుడ పాణిగ్రహణము చేసికొని నే నా సౌధంబులఁ గొన్ని దినంబులా రత్నాంగిఁ గ్రీడాసౌఖ్యంబు లనుభవించితిని.

అట్టి సౌఖ్యంబు మరగిన నాకు నా యనుంగు చెల్లెలుగాని తండ్రిగాని జ్ఞాపకమే రాలేదు. అంత నొక్కనాఁడు నన్నానెలంత నీ యుదంతమేమని యడిగినంత నా కథ యంతయు నాకుఁ దెప్పున జ్ఞాపకము వచ్చినది. అన్నిటికంటె నాకు నా యనుంగుసోదరి యేమయ్యెనొకో యను విచారము బాధింపఁదొడంగినది. అప్పుడు తటాలున లేచి యెచ్చటికో పరుగిడఁదొడంగితిని. అట్లేమియు మాట్లాడక యూరక యరుగుచున్న నన్నుఁజూచి వెరగుపడుచు నా రత్నాంగి వేవేగము వచ్చి నా చేతులు పట్టుకొని యిట్లనియె.

నాథా! నీ యుదంతము చెప్పుమని యడిగినంత నేదియో తలంచుకొని యూరక పరుగిడుచుంటిరేమి? ఎక్కడకుఁ బోయెదరు! మీ కథ యేమని యడిగెను. అప్పుడా పడఁతికి నా వృత్తాంతమంతయు జెప్ప మా లవంగి యేమైపోయెనో యను చింతతోఁ పరుగిడుచుంటినని చెప్పితిని. దాని కమ్మానిని నవ్వి యాహా! యెన్నఁచో చెట్టుక్రిందఁ దిగవిడిచి వచ్చిన చిన్న దాని నిప్పుడు తలంచుకొని దాని రక్షించుటకై పోవుచుంటిరా? మేలు మేలు. మీ యనురాగము స్తుతిపాత్రమైయున్నది. రేపు పోవచ్చును రండని మరల నంతఃపురమునకుఁ దీసికొని పోయినది.

ఆది మొదలు అచ్చట వింతలు దాని విలాసములు నాకేమియు నుల్లాసమును గలుగఁజేసినవికావు. నేనామఱునాఁడే భూలోకమునకుఁ బయనమైనంత నన్నెలంతయు నాతో దానుగూడ ప్రయాణ మయ్యెను. నేను వలదని యెంత చెప్పినను వినినదికాదు. నేనా రత్నాంగితోఁగూడ మునువచ్చిన మార్గంబుననే భూలోకంబునకు వచ్చితిని.

చెట్టుదిగి యందు లవంగి గానక పదిచిహ్నములంజూచి యేడ్చుచు నోలవంగీ! లవంగీ! యని యయ్యడవి మారుపలుక యూరక యరవఁజొచ్చితిని. అప్పటికి లెక్కించుకొన నెలయైనది . ఇంతదనుక నిందుండునా! యేదియో క్రూరమృగము భక్షించి యుండవచ్చునని నేను నిశ్చయించితిని. దాని బుద్దిని గురించియుఁ నీతిని గుఱించియు రూపమును గుఱించియుఁ దలంచుకొని దుఃఖమాగక బిట్టు శోకించుచు నెట్టకేలకు నా రత్నాంగి యనునయ వాక్యములచే ధైర్యము తెచ్చుకొని యయ్యడవిలో వెదకుచు నడువఁజొచ్చితిని. ఇట్టు నడుచుచుండ మార్గములో నొక చెఱువు గనంబడినది. మణియును నగలును పుట్టంబులును గట్టునఁబెట్టి మే మిరువురము మార్గాయాసము వాయ నందు స్నానము చేయుచుంటిమి. అంతలో నొక గద్దవచ్చి గట్టున బెట్టిన నాగశిరోమణిని దన్నుకొనిపోయి దూరముగానున్న యొక చెట్టుమీద