పుట:కాశీమజిలీకథలు -01.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేపనవ్విన కథ

299

దాని మాటప్రకారము శిరోమణిని గైకొని తత్ప్రభావముచే సులభముగాఁ బాతాళలోకమునకుఁ బోయితిని. అన్నన్నా! నాకప్పుడు కొంచెమైనను మా లవంగిమాట జ్ఞాపకముండినతో నట్లు పోవుదునా? అయ్యారే! యా పాతాళలోక వైభవ మేమని వక్కాణింతును. స్వర్గముగూడ దానికి సాటిగాదని చెప్పఁగలను. పాతాళలోకము చీకటిగానుండునని చెప్పుకొనుమాట లబద్దము . అందున్న రత్నరాసులకాంతి యుగ్రముగాక యనేకసూర్యులకాంతివలె వెలుంగుచుండును. దానంజేసి యందు రాత్రియుఁ బగలును భేదము లేదు.

అందు నేను యధేచ్చం గ్రుమ్మరుచుండ నొకదండ నుద్యానవనములో వయస్యలతోడఁ గ్రీడింపుచున్న యొకచేడియం గంటి నా వాల్గంటివంటి సోయగము గల యలనాగ నాకంబుననైనను లేదల చెప్పవచ్చును. దానిం జూచినంత నాకు భైరవపక్షి మాటం జ్ఞాపకమువచ్చినది. నాగశిరోమణిని హస్తంబునంబూని దాని చెంతకుఁ బోయితిని.

అక్కాంతమణియు మణిహస్తుండనగు నన్నుఁజూచి యత్యంత సంతోషముతో వచ్చి యొక పుష్పమాలిక నా మెడలో వైచి యిట్టట్టని నన్నడుగకయే గాఢాలింగనముఁ జేసికొనినది . అంత సోయగముగల కలకంఠివచ్చి మచ్చికతోఁ గౌఁగలించుకొనినప్పు డెట్టి సంతోషము గలుగునో చింతింపుము. నేనును మేనుగరుపార నపారమోదముతో సుఖపారవశ్యంబున నొక నిమిషము మైమరచి యుంటిని.

అంత నన్నెలంతయు నన్నా యుద్యానవనంబున డంబు మీరియున్న క్రీడామందిరమునకుఁ దీసికొనిపోయి చేడియలచే నమరింపఁబడిన కాంచనపీఠంబునఁ గూర్చుండబెట్టి మార్గాయాసంబు వాయ వింజామరచేఁ దానే వీవఁదొడంగినది. ఆహా! అప్పటి యా యానందము దలంచుకొనినంత నిప్పుడు మేనుగరపు జెందుచున్నది. అంత నే నాకాంత చేయు సుపచారములకు వింతపడి యప్పడఁతిని నీవృత్తాంతమేమని యడిగితిని.

అప్పు డచ్చేడియ మొగమునకుఁ జిఱునగవునగయై మెఱయ నాతో నిట్లనియె. ఆర్యా! నాపేరు రత్నాంగి, నేను నాగకాంతను. మణిమంతుఁడను పేరుగల మాతండ్రి నన్నుఁ గొప్పతపంబుజేసి కనెను. నేనొకనాఁడు చేడియలతో నిత్తోటలోఁ గ్రీడింపుచుండ నాత్రేయుండను మహర్షి యిచ్చటికి వచ్చెను. ఆటతొందరచే నేనా యతి రాక బరామర్శింపనైతిని. దాని కతండు గోపించి యీ కాంతకు మనుష్యుండు పతియగు ననియు నిడుమలు గుడుచుననియు శపించెను.

ఆ మాటవిని చెలికత్తియలతో నే నత్తపోధనసత్తముని పాదంబులంబడి ప్రార్ధించితిని. దాన సంతసించి యమ్మునిపతి యువతీ! మనుజవల్లభత్వము నీకుఁ దప్పదు. నాగశిరోమణి హస్తంబున ధరించి వచ్చిన వానినిఁ బతిగా వరింపుము. నీవు సౌఖ్యమందెదవని చెప్పుచునే యంతర్హితుఁడయ్యెను. అమ్మునితల్లజుని వచనంబు