పుట:కాశీమజిలీకథలు -01.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

298

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అంత నయ్యోగి యయ్యెలనాగతో సంయోగినీదేవి దేవాలయంబునకుఁ బ్రదక్షణము చేయుచుండ నొకదండఁ దటాకము దాపుననున్న మంటపములో రెండవ చండికాదేవివలెఁ దపంబు చేయుచున్న యా లవంగి గనంబడుటచే నాశ్చర్యపడుచు నా చిన్నదానితోఁగూడ నా చేడియకు మ్రొక్కి యందు గూర్చుండెను. లవంగియు నతనికి మరల మ్రొక్కి కన్నులం దెరచి జపమాలికను దొడలపై నిడి యతని నెద్దియో యడుగఁదలంచు నంతలో నెచ్చటినుండియో యొక పురుషుడు ఆకసమునుండి యూడి వచ్చునట్లు వచ్చి యా తటాకములోఁ బడియెను.

ఆ చప్పుడువిని వారు మువ్వురు వెరఁగుపడుచుఁ నయ్యో! పై నుండి వచ్చి దీనిలో నెవ్వడో పడి మునింగెను. ఇది మిగుల వింతగానున్నది. పాప మూరక వాఁడు మృతినొందును. వీనిం బ్రతికించిన మిగుల పుణ్యముగదా యని పలుకుచు నా బాలయోగి యప్పుడే యత్తటాకములో నురికి మునిఁగి యతనిని వెదకిబట్టుకొని పైకిలాగి కొనివచ్చి యొడ్డునం జేరెను. ఆహా! వాని సాహసము మిగుల కొనియాడఁ దగి యున్నది.

అప్పుడా పురుషుఁడు కన్నులు మూసికొని యొగర్చుచు గొండొకసేపునకు మేను దెలిసికొని తన్నా యోగియే బ్రతికించెనని యెఱిఁగి యతనితో నిట్లనియె.

అయ్యా! నీవు నాపాలిటి దైవమని నమ్మెదను. నన్నుఁ జచ్చినవానిఁ బ్రతికించితివి. అయినను నాకీ సమయములో మరణమే మేలని తోచుచున్నది. నావంటి పాపాత్ముఁ డెందైనఁగలడా? యని యెవ్వరినో తలంచుకొని విచారింపఁ దొడంగెను.

అప్పుడా బాలయోగి యతనితో నయ్యా! మీరిట్టి విరక్తిమాట లాడుచుంటిరేమి? యెద్దియేని యాపద జెందితిరా? యీ తటాకములో నాకసమునుండి యెట్లు పడితిరి? ఇది మాకుఁ గడువింతగా నున్నది. మీ వృత్తాంతము గోప్యము కానిదియేని జెప్పుఁడని యడిగిన నా పురుషుఁడు లవంగి విన నతనితోఁ దనకథ నిట్లు చెప్పఁదొడంగెను.

అయ్యా! నేను ప్రభుకీర్తియను మంత్రి కుమారుండను. నాపేరు ప్రద్యుమ్నుఁడు. లవంగియను పేరుగల నా చెల్లెలును నేనును దండ్రి యాపద దాటించుటకై దేశమువదలి యనేక దేశములు దిరిగితిమిగాని యెందును మా కార్యము దీరినదికాదు. అంత నొకనాఁ డచ్చేడియము నేను నొక వటవృక్షముక్రింద నెండకు దాళలేక శయనించితిమి. దానికి నిద్రపట్టలేదు. అప్పుడు లవంగి లేచి దాహమడుగునని తలంచి యా చెట్టెక్కి జలముఁజాడ జూచుచుంటిని. ఇంతలో నా తరు కోటరమునుండి యొకకృష్ణసర్పముపై గూడిలోనున్న భైరవపక్షి పిల్లలనుం దిన బైకిఁ బ్రాకుచుండెను. అది చూచి నేను కత్తితోఁ నా పామును జంపితిని. దానికి సంతసించుచు నా పక్షి నాయొద్దకు వచ్చి కృతజ్ఞత జూపించుచు నా యాగమనకారణం బడిగి సర్పశిరోమణిం గైకొని యా కోటద్వారంబునఁ బాతాళలోకమునకుఁ బొమ్మని యుపాయము చెప్పినది.