పుట:కాశీమజిలీకథలు -01.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేపనవ్విన కథ

293

అంత నుదయంబున నమ్మదవతితో గూడ నా జయసేనుండు ఆ తురగమెక్కి తన గ్రామమార్గముగా నడువజొచ్చెను దైవగతిని దారిదప్పి యా గుఱ్ఱము మరియొక దారిని నడిచినది. ఆదారినిం బోవంబోవ నెప్పటికిని దన దేశపుజాడ యేమియు గనంబడిననదికాదు. అప్పుడు వెరగందుచు నాజయసేనుడు దారి తప్పినదని తెలిసికొనియేమియు జేయలేక దైవముమీఁద భారమువైచి యా దారింబడి మూఁడు దినములు పోయెను. అంత నాలుగవదిన ముదయమున వారికొక యుద్యానవనము గనంబడినది. దానిం జూచినతోడనే జయసేనుని కది యొక నగరప్రాంతమని యెంతో సంతోషము జనించినది. దానిలోఁ బ్రవేశించినంత నందెవ్వరు జనులు గనంబడలేదు. వా రా యుద్యానవనములోఁ బ్రవేశించి యందలి వింతలం జూచుచుండ నొక దండవస్తోకశోభాకరం బగు నొక పద్మాకరంబు గనంబడినది. వారు తురగము దిగి యందు మార్గాయాసము వాయఁ గొంతొక సేపు జలకేళిందేలి మరల దురగమెక్కి గమ్యప్రదేశ మరయుచుండ నల్లంత దవ్వులో నొకమేడ కన్నులకు వేడుక గలుగఁ జేసినది.

మిగుల సంతోషముతో నా సౌధము దాపునకుఁబోయి గుఱ్ఱముదిగి యందెవ్వరుం గానక వారు వెరగుజెందుచు లోనికి బోయిరి. లోపల జనులెవ్వరులేరు. అనేక విచిత్రవస్తువులచే నలంకరింపఁబడి యున్నది అందాహారపదార్థము లనేకములు గలవు. ఆ దంపతులా మేడ నలుమూలలు తిరిగి యెవ్వరును లేరని తెలిసికొని మిగుల నాకలి గొనియున్నవారగుట నందున్న మధురపదార్ధములచే నాఁకలి యడంచుకొనిరి. ఇంతలో సాయంకాల మగుటయు నదియేమి చిత్రమో కాని యందు పెక్కుదీపము లెవ్వరును వెలిగింపకయే వెలుఁగుచుండెను. వెరగుఁజెందుచు నవి మణిదీపము లని తెలిసికొనిరి.

అందుపరిభాగమున నొకకగదిలో నద్భుతమైన యలంకారముతో హంసతూలికాతల్ప మొకటి యమర్చఁబడి యున్నది. దానింజూచి యా దంపతులు అదియంతయు భగవంతుడు దమనిమిత్త మమరించి యుంచెనని సంతసించుచు నా తల్పంబుజేరి మన్మథకల్పప్రతాపంబున ననేకబంధగతుల నా రాత్రి రతికేళిం దేలిరి.

అహా! యొకప్పుడు కీడుగూడ మేలునకే కారణమగును. ఆ రీతి వారు మూఁడురాత్రులు యథేష్టకామంబు లనుభవించిరి. అంత నాల్గవనాఁ డుదయంబున నా లవంగి కన్నులు దెరచి చూచినంత ప్రాంతభాగమంతయు మహారణ్యముగా నున్నది. ఆ మేడయు నా తల్పమును జయసేనుఁడుగూడ గనంబడలేదు. అందుల కాశ్చర్య మందుచు మరల గన్నులు మూసికొని యది కలగా దలంచి యొక్కింతసేపు నిదానించి దిరుగగన్నులు దెరచి చూచి యది కలగాదనియు నిజముగా యట్లయ్యెననియు దెలిసికొనినది.

అప్పు డప్పడఁతి మనంబునం బొడమిన చింతాతరంగము లేమని చెప్పుదును? మదిలో నిట్లని తలంచినది. అయ్యో! దైవము నన్నిట్లు పైకెత్తి నేలవైచి కొట్టెనే? యిది యేమి మాయ? జయసేనుఁ డెక్కడికిఁ బోయెను? విదాఘతప్తుండగు వానికి వర్షాగమనంబునఁ జింతించుచున్న నాకీ జయసేనుని యాధారముగాఁ జూపించి మరల