పుట:కాశీమజిలీకథలు -01.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

దురు. మాతండ్రి నన్ను వలదని యెంత చెప్పినను వినక నేఁటి యుదయమున సేనలతో వేటకై యీ యడవికి వచ్చిన కొంతసేపటికి మా శిబిరములన్నియు నెగిరిపోవునట్లు గాలి విసరఁదొడంగినది. పిమ్మట నత్యద్భుతముగా వర్షము గురియ మొదలు పెట్టినది. అందు బిడుగులు పడి యనేకులు మృతినొందిరి. కొందఱు పారిపోయిరి. నేనును నా గాలివానకు భయపడి తురగమెక్కి యొక్కరుండ నింటికి బోవలెనని బయలుదేరితిని గాని యింతలో జీకటి పడుటచే దారితప్పినది. ఈ మార్గమున వచ్చితి. ఇందు నీవు గనంబడితివి.

ఈ మహారణ్యములో నీవేటికి వసించితివి? నీవు బిలిచిన ప్రద్యుమ్ను డెవ్వడు? నీ పేరేమి? నీ వృత్తాంతమంతయు జెప్పుమని యడిగిన విని యా లవంగి తెల్లబోయి అయ్యో! నిన్ను మా యన్నయని కౌగలించుకొంటినే. నీవు మఱియొకండవై తివి. అయినను ఆపత్సముద్రంబున నన్ను ముంచిన భగవంతుండు నీవను తెప్పనందించెను కాబోలు ! కానిమ్ము. ఒకరిత నుండుటచే గుండెలు తాళకున్నవి. నా యుదంతము నీ కెఱింగించెద వినుమని యన్నయు దాను నిల్లు వెడలినది మొదలు చెట్టుక్రింద బరుండి నిద్రపోవువఱకు జరిగిన కథయంతయుం జెప్పి పుణ్యాత్మా! నాయన్న యెందుంబోయెనో యెఱుంగను. దిక్కుమాలియున్న నన్ను రక్షింపుమని వేడుకొనినది.

ఇంతలో మఱియు పట్టబగలనునట్లు మెఱసినది. ఆ వెల్తురున నయ్యిరువురు చక్కగా జూచుకొని యొండొరుల సౌందర్యవిశేషముల కచ్చెరువందుచు నొకరి కొకరు వరించిరి. అప్పుడు మేనం బులకలు బొడమ భయము నెపంబున దన్ను గౌగిలించుకొనిన యమ్మించుబోడి యంగస్పర్శంబున నా జయసేనునికి మేన బులకలు బొడమినవి. దానంజేసియే యొండొరుల యభిప్రాయములు వారికి దేటపడినవి.

కొంతసే పట్లన్యాపదేశంబున శృంగారచేష్టల గప్పిపుచ్చిరి గాని చిట్టచివర కా గుట్టుపట్టలేక యారాచపట్టి మంత్రిపట్టి కిట్లనియె. బోటీ! మన మీ లాటి విజనప్రదేశ మందుండియు లజ్జ పెంపునం జేసి గదా? యిట్టు వలపుల వెల్లడిజేయ సందియమందుచుంటిమి. ఇంకను దాచనేల? నాడెందము నీయందము లాగికొనినది. మదనుడు నన్ను వేపుచున్నాడు. క్షణకాలమైన సైపలేకున్నాను. నీ మనోరధమెద్దియో యెఱింగికాని యిష్టము దీర్చుకొనరాదని యుంటిని. వేగ నెఱింగింపుమని యడిగిన యప్పడుచు సిగ్గు విడిచి యతని బిగ్గరగా గౌగలించుకొనుచు నేను నీ యధీననైతి. మరల దీనికి నన్నడుగవలయునా? మదనుడు నిన్నొక్కనినే కాదు. నీ కన్న నెక్కుడుగా నన్నును వేపు చున్నాడని పలికిన సంతసించుచు నా జయసేనుండు పట్టరాని మోహముతో నమ్మగువ బిగియ గౌగలించుకొని ముద్దుగొనుచు మిగుల సంతోషముతో నుండెను. వారిరువురకు నా రాత్రియంతయు నొక క్షణముగా దోచలేదు.