పుట:కాశీమజిలీకథలు -01.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేపనవ్విన కథ

291

గలిగియు దిక్కులేనిదాన నైతిని. అవి యనేకప్రకారములుఁ బలవరించుచు నయ్యడవి యంతయుఁ బ్రతిధ్వనులీయఁ బ్రద్యుమ్నాయని యరచుచు సాయంకాలము వఱకు కుమ్మరఁ జొచ్చెను.

అంత నానెలఁత శోకాంధకారంబునకుఁ దోడుగాఁ జీఁకటిగూడ వ్యాపింప దొడంగినది. అప్పుడు వనదేవతయుంబోలె నిర్మనుష్యంబగు నయ్యడవిలోఁ దిరుగు చున్న యా చిన్నదాని హృదయ మెట్లుండునో విచారింపుము ఆ చీఁకటికిఁ దోడుగా మబ్బుపట్టి వర్షము గురియదొడంగినది. ఆ యుఱుములకు మెఱుపులకుఁ దాళలేక యానాళీకవదన హృదయంబున ధైర్యమాపలేక మరణకృతనిశ్చయమై యా మఱ్ఱి మ్రాను మొదలున గొంచెమిమ్ముగా నుండుటంజూచి వర్షమునకుఁ దలదాచుకొనియెను. గాఢాంధకారముగా నున్న యా రాత్రి శర్వరీనిమీలనములుఁబోలె నొప్పుచున్న మెఱపు వెల్తురున నత్తరుణికిఁ గురంగట తురగముపై నెక్కియున్న యొక పురుషుఁడు గనంబడెను. అప్పు డప్పడఁతి యింతింతనరాని సంతసముతో అన్నా! ప్రద్యుమ్నా! యిటురా! ఇదిగో నేనిచ్చట నుంటిని. ఇంతదనుక నెందు బోయితివి? నీకై నేను పెక్కు తెరంగులఁ జింతించుచుంటిని సుమీ! యని పెద్ద కేకలు పెట్టెను

ఆ మాటలు విని గుఱ్ఱముపై నున్న యా పురుషుఁడు భయపడి యేదియో పిశాచము ఆ వృక్షము నాశ్రయించి యున్నది. మనుష్యవాక్యముల బిల్చుచున్నది. ఇందుండినఁ బ్రమాదము రాకమానదు. అని యూహించి పారిపోవఁదలంచు చున్నంతలో మరలఁ దళుక్కుమని మెఱసినది. ఆ వెల్తురున నా పురుషుఁడు లవంగినిం జూచెను. ఆ చిన్నదాని మేనికాంతి మెఱుఁపుతో దులగానుండుటచే వెరగందుచు నతం డౌరా! పిశాచమనుకొంటిని. కాదు కాదు. ఒక యువతివలెఁ గనంబడుచున్నది. యా నెలతుక యొక్కరితయ యిక్కడ నుండుట కేమి హేతువో! అని ధ్యానించుచు గుఱ్ఱముదిగి దాని చెంతకుఁ బోయెను.

ఇంతలో మెఱపు మెఱసినది. అప్పు డొండొరులు బాగుగాఁ జూచుకొనిరి. లవంగి యతని నిజముగాఁ దన యన్న ప్రద్యుమ్నుఁడే యనుకొని అన్నా! యిటురా! నేనిందుంటిని. నీకీ తురగ మెక్కడిది? అని పలుకగా నా చిలుకల కొలికి పలుకులకు వెరగందుచు నా రాజకుమారుఁడా లవంగికి మఱింత దగ్గరగాఁ బోయెను.

అప్పుడా యిమ్ములోనుండి బయటికివచ్చి యా చీకటిలో నా లవంగి యా పురుషునిం గౌఁగలించుకొని యన్నా! నేను పలుమారు పల్కరించినను ననుమానము జెందుచు మాటాడకుంటివేమి? ఎచ్చటికిఁ బోయితివి? నీ యఱిగిన తెరగెల్లఁ జెప్పుమని యడిగిన నతండు తెల్లబోవుచు లవంగి కిట్లనియె. తన్వీ! నేను మీయన్నయగు ప్రద్యుమ్నుడనుగాను. మత్స్యదేశాధీశ్వరుని కుమారుఁడ. నా పేరు జయసేనుఁడం