పుట:కాశీమజిలీకథలు -01.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

290

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

డెవ్వఁడో పుణ్యాత్ముఁడు చెట్టెక్కి చంపివేసెను. మన కిటుమీఁద బిల్లలు నిలుతురు. అతండు మనకు గొప్ప యుపకారము గావించెను. వానికిఁ బ్రతిక్రియ యెద్దియేని జేయుమని బోధించిన నామగపక్షి సంతసించుచు భార్యకిట్లనియె.

బోటీ! మనము పక్షులమైయుండియు మనకన్న నధికులకు మనుష్యుల కేమి యుపకారము చేయఁగలము? అయినను నీవు చెప్పితివిగాన గృతజ్ఞతయైనం జూపవలయు నని పలికి మెల్లన నతనియొద్దకుఁ బోయి మ్రొక్కి మనుష్యభాషలో నిట్లనియె.

ఆర్యా! నీవు మాకుఁ జేసిన మేలు చిరకాలమువఱకు చెప్పుకొనఁదగియున్నది. కులము నిలిపితివి. మీవంటిసాధులకుఁ పరోపకారపారీణత సహజమైనను మాకృతజ్ణత యిట్లు ప్రేరేపించుచున్నది. మనుష్యసంచారశూన్యంబగు నీకాంతారమునకు నీవు రాఁగతంబేమి? నీయుదంతం బెరిగింపుమని యడిగిన నాపక్షిపతినీతికి మెచ్చుకొని ప్రద్యుమ్నుఁడు తనవృత్తాంతమంతయు నెఱింగించి యాచేప నవ్విన కారణము తెలిసికొనుటకే వచ్చితినని చెప్పెను.

అప్పు డాపక్షి ఆర్యా! అత్యంత నిపుణమతులైన మనుష్యులకుఁ దెలియరాని యంశములు మా బోంట్లకుఁ దెలియునా? యొక విశేషము చెప్పెదను వినుము. ఈకృష్ణసర్పశిరమందుఁ జిత్రమైన మణియొకటి గలదు. వానిం గైకొని యాకోటమార్గంబునం జనినఁ బాతాళలోకంబు గనంబడును. అందొక సుందరి నీకు వశ్యయగును. ఎట్టి సమయంబునను నీ మణి మాత్రము విడిచి యుండకుము. మణివియోగంబున నాకాంతావియోగముగూడ కాఁగలదు. ఆ పాతాళలోకవాసులు చేప నవ్విన కారణము జెప్పగలరని యూహించెదను. అట్లు చేయుమని బోధించిన సంతసించి యతం డందున్న సర్పశిరస్సు వెదకి తచ్చిరోమణిని సంగ్రహించి మఱియు నా భైరవపక్షిని తాను దలంచుకొని నప్పుడు వచ్చున ట్లొడంబడఁజేసి తదుపదిష్టమార్గంబున రసాతలమునకుఁబోయెను.

అంత నా చెట్టుక్రింద నిద్రబోవుచున్న లవంగి కొంతసేపునకు మేల్కొని కన్నులు నులిమికొనుచు నలుదిసలం బరికించి ప్రద్యుమ్నుం గానక తొట్రుపాటుతో అన్నా! అన్నా! ప్రద్యుమ్నాయని యరవఁజొచ్చెను. ఎందును వాని కంఠధ్వని వినంబడక యత్యాతురముతో అయ్యో! యిదియేమి పాపము! నేను నిద్రలేచి నంతలో నా సోదరుం డెందుపోయెను? ఎక్కడికైనను బోయినచో నాకుఁ జెప్పకుండునా? ఏదియేని క్రూరమృగబాధ జెందియుండ లేదుగద? అట్టి యాపద తటస్థించినప్పుడు చప్పుడు గాకుండానా? పరాక్రమశాలియగు నతని మృగములేమి జేయఁగలవు? అతఁడు ప్రమాదమున నిచ్చటినుండి యెచ్చటికైనఁ బోవలయునుగాని స్వబుద్దిచే నన్నొంటిగా నడవిలో విడిచిపోవు వాఁడుకాడు. యేమి చేయుదును? నాకు దిక్కెవ్వరు? ఔరా! దైవమెట్టి యాపద దెచ్చిపెట్టెనే! నాకీ యడవిలో మరణము విధించెను గాఁబోలు. ఎంతో దిక్కు