పుట:కాశీమజిలీకథలు -01.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేపనవ్విన కథ

289

అది మిగుల నడవిగానుండుటచే రాత్రి కెద్దినేని గ్రామము జేరవలసియున్నది. కావున సునాయాసముగా నున్నను మరల నడువసాగిరి. అట్లు సాయంకాలమువఱకు నడచినను చిన్నపల్లెయైనఁ గనబడినదికాదు. భయపడి పెందలకడ నొ చెట్టుక్రింద బస చేసి ప్రద్యుమ్నుడు ఆయుధపాణియై తెల్లవారువరకు నిద్దురజెందక మృగబాధ రాకుండఁ గాపాడుచుండెను. ఆ మఱునాఁడు సాయంకాలమువఱకు నడచిరి. గ్రామమేదియుఁ గానంబడలేదు. అప్పుడు భయపడి ప్రద్యుమ్నుడు చెల్లెలితో అమ్మాణీ! మనము దారి కానిదారినివచ్చి యడవిలోఁ బడితిమి. ఎంతనడచినను పురమేదియుఁ గనంబడకున్నది. మనము తెచ్చిన యాహారవస్తువులు కొంచెముగా నున్నవి. నీకునడుమ మిగులశ్రమగా నున్నట్లు తోచుచున్నది. నేను రావలదని చెప్పినను వినక పోతివి. ఇప్పుడేమిచేయుదుము అని విచారించుచు మరల నాదినము మధ్యాహ్నము వఱకు నడిచిరి.

అందొక గొప్పమఱ్ఱిచెట్టు గనంబడినది. దానినీడ దట్టముగా నుండుటచే మార్గాయాసముచే నొడలెఱుంగక గాఢముగా నిద్రపోవుచున్న లవంగిని జూచి ప్రద్యుమ్ను డాత్మగతంబున నిట్లని తలంచెను.

అయ్యో! యీచిన్నది మిగుల సుకుమారముగలది. అంతఃపురములలో సంచరింపఁదగినది. తండ్రి యిడుములు దలంచి నాతోఁగూడ వచ్చినది. ఆహా! దీనిపితృవాత్సల్యము మిగులఁ గొనియాడదగియున్నది! కటకటా! చిగురుటాకులకన్నను మెత్తనగు దీనియడుగు లెట్లు పొక్కులెక్కినవో? యిక్కుసుమకోమలి నింటియొద్దనుండక తోడవత్తునన్నంతమాత్రముననే తీసికొనిరావలయునా! నేనే కఠినాత్ముండ. అయ్యో! యీ ప్రాంతమం దెచ్చటను నీరు దొరకనట్లున్నది. ఇది లేచి దాహమని యడిగిన నేమి చేయుదును? ఈలోపలనే జలముండుతా వరసిన మేలుగదా! యని నిశ్చయించి మెల్లన నామఱ్ఱిచెట్టెక్కెను. ఆమ్రాను మిగుల గొప్పదగుటచే చివరకొమ్మలకెక్కి నలుదెసలు పరికించుచుండెను. ఇంతలో నావృక్షము కోటరమునుండి యద్భుతమైన కృష్ణసర్ప మొకటి పైకొమ్మమీఁదునకుఁ బ్రాకదొడంగినది. దానిఁజూచి ప్రద్యుమ్నుఁడు వెరవక వరలోనున్న సూరకత్తి పెరికి యొక్క వ్రేటున నాసర్పముతల నరికివైచెను. ఆకృష్ణసర్పము తలదెగి ప్రాణములఁ బాసి మృతినొందినది.

ఆ మానుచివర భైరవపక్షులు రెండు గూడుకట్టుకొని కాపురముచేయుచు సంవత్సరమునకు రెండుసారులు గ్రుడ్లు బెట్టుచుండును. పెట్టిన గ్రుడ్లనెల్ల నీకృష్ణసర్పము పసిగట్టి వచ్చి భక్షించుచుండును. ఈరీతి బెద్దకాలము జరిగినంత నేఁటికి దానికి గాలము మూడి ప్రద్యుమ్నుని చేతిలో మృతినొందినది. ఆపద జూచి యా యాఁడుపక్షి యిట్లనియె నాథా! మనకుల మభివృద్ధినొందకుండ జేయుచున్న యీ దుష్టసర్పమును నేఁ