పుట:కాశీమజిలీకథలు -01.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

294

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నతనింగూడ మాయజేసెనే? ఒకవేళ నిదియంతయుఁ గల కాదుగదా! నేను భ్రమసి నిజమనుకొంటిని. నిజముగా జయసేనుఁ డనువాఁడు నన్నుఁ జేపట్టలేదు. వానితో నేను మేడలో గ్రీడింపలేదు. స్వప్నమహాత్యమే నన్నిట్లు భ్రమపెట్టుచున్నది. అనియూహించి యంతలోఁ గలగాదు నిజమే నేను నిద్ర యెచ్చట బోయితిని? ఇవిగో నా యంగంబుల వాని నఖదంతచిహ్నములు గనఁబడుచున్నవి. దైవప్రతికూలము చేతనే నాకు మరల నీ యాపద తటస్థించినది. నాకుఁ దల్లిదండ్రులును సోదరుడును గనంబడని యప్పుడు సైతమీ జయసేన వియోగంబునంగల దుఃఖము గలుగలేదు. ఈ వియోగ తాపమెట్లు భరింతునని యనేక ప్రకారములఁ బలవరించుచు సీ! లోకంబున సర్వకాలములు దుఃఖముతోఁ గూడికొనినవే కాని స్థిరసౌఖ్యప్రదములు కావు.

శ్లో॥ భోగె రోగభయం కులె చ్యుతిభయం విత్తె నృపాలాద్భయం
      మానె దైన్యభయం బలె రిపుభయం రూపె జరాయాభయం
      శాస్త్రె వాదభయం గుణే ఖలభయం కాయె కృతాంతాద్భయం
      సర్వంవస్తుభయాన్వితం భువినృణాం వైరాగ్యమేవా భయం.

అనునట్లు వైరాగ్యము వంటిది మఱియొకటిలేదు. తండ్రి మరణము దప్పింప నిల్లువెడలితిని దారిలో సోదరునిం గోలుపోయితిని. జయసేనుని బెండ్లియాడి వానితో వియోగమును బొందితిని. దీనిలోసుఖమెంత దుఃఖమెంత తలపోయ దుఃఖమే యధికముగా నున్నది. దైవమేమి చేయునో యట్లు పోవుదాననని తలంచుటకంటె మంచి మార్గములేదు. తండ్రిచావు దప్పింప నా తరమా? యెవ్వరేమైనను సరియే నేనేమి చేయఁగలను. ఇంక యోగం బవలంబించి ముక్తిమార్గ మందెదనని తలంచి యా యడవిలో నిర్భయముగాఁ దిఱుగుచు ఫలములను బర్ణములను భక్షింపుచుండెను. యోగినియై క్రమంబున నయ్యరణ్యములో సంచరించుచుండ నయ్యండజయాన కొకనా డొకచోట గొప్ప కోట యొకటి గనంబడినది.

అది యేదియో పురమనుకొని యవ్వనిత దానిచుట్టును దిరుగ నొకదెస గోపురమును ద్వారమునుఁ జూడనయ్యెను. దానింబట్టి యా మంత్రిపట్టి దేవాలయముగా నిశ్చయించి తలుపులు మూసియుండుటచే జింతించుచు నా తలుపులోనున్న చిన్న తలుపొకటి జేఁతితోఁ త్రోసిచూచెను. దానికి బీగము వైచునప్పుడు గడియలు తగులు కొనమి నా త్రోపుతో నా తలుపు వచ్చినది. మిగుల సంతసించుచు నమ్మించుబోణి యా ద్వారము దారిని లోనికి బోయినంత నదియొక యమ్మవారి గుడివలెఁ గనంబడినది. తన మనోభీష్టము సఫలముజేయ భగవంతుఁడు తన్నచ్చటికిఁ దీసికొని వచ్చెనని సంతోషించుచు నప్పడఁతి యగ్గుడిచుట్టును దిరిగి లోని తలుపులన్నియుఁ దెఱవఁబడియు యుండిన నా దేవతకు నమస్కరించి పెక్కుగతుల స్తుతిఁజేసినది.