పుట:కాశీమజిలీకథలు -01.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మానఁడు. మీరు పోవల దింటనే యుండుఁడని పలికినఁ దండ్రి నెట్లో సమాధానపరచి మంచిలగ్నమున వారిరువురు పరదేశమునకుఁ బోయిరి.

వారి కశ్వగమనమున మిగుల నేర్పుగలిగియున్నది. మంచివేగముగల గుఱ్ఱము లెక్కి సాయంకాలమునకే విశేషప్రయాణము చేసిరి. నడుమనడుమఁ జిన్నగ్రామములలో నివసించుచు నాలుగుదినములకు నమారావతి యనుపట్టణము చేరిరి. అందు సత్రములో బసచేసి యా యూరివింతలన్నియుఁ జూచుచు దమకు బుద్ధిమంతులని తోచిన వారినెల్లఁ జేపనవ్విన కారణ మడుగుచుఁ బదిదినము లందుండిరి. వారి మాట వినినవారెల్ల పరిహాసముచేయుచు నీపాటిపనికై యింతప్రయత్నము చేయవలెనా యని నవ్వసాగిరి.

మఱియొకనాఁడు సాయంకాలమున నూరంతయుఁ దిరిగివచ్చి ప్రద్యుమ్నుఁడు లవంగి కిట్లనియె. అమ్మాణీ! మన మీయూరువచ్చి పదిదినములైనది. మనమాట యెవ్వరినడిగినను నవ్వుచుండిరిగాని తగు నుత్తరము చెప్పరైరి. అంత బుద్దిమంతు లీయార లేనట్లు తోచుచున్నది. మఱియు కోటగోడమీఁద నొక శాసనము జూచితిని. ఈపట్టణపు రాజకూఁతురు ప్రభావతి యనునది సకలవిద్యలయందుఁ బ్రౌఢురాలనియుఁ జతురంగములో నామె నోడించినవారితో పెండ్లిచేయుదుమనియు వ్రాయఁబడియున్నది. ఓడిపోయినచో నురిదీయుదురఁట ! దానితో జతురంగమాడి యనేకు లురిదీయబడిరి. మన యిరువురకుఁ జతురంగమందు మిగుల పాటవము గలదు గదా! నేను రేపుపోయి దాని నోడించివత్తునే? యనుటయు నతని కా లవంగి యిట్లనియె.

అన్నా! మన మొకకార్యమునకై వచ్చి వేరొకకార్యమునకుఁ బ్రయత్నింప నేటికి? మనపనియైన వెనుక నెన్నికార్యములేనియుఁ జేయవచ్చును. ఇదియునుం గాక యొకవేళ నోడిపోయినచో నేమి చేయనగు. జయాపజయము లెవ్వరు చెప్పఁగలరు? పోవలదుడుగుమని పలికిన నతండు నవ్వుచు నన్నుఁ జతురంగములో నోడించువా రీమూఁడులోకములలో గలరా? నా చాతుర్యము నీ వెఱుంగనిదా? ఎఱింగియు నట్లనినచో నేనేమి చెప్పుదునని పలుకుచు నెట్టకేల కాపొలఁతి వియ్యకొనఁ జేసెను.

అంత మరునాఁ డతఁడు చక్కగా నలంకరించుకొని కోటయొద్ద కరిగి యచ్చట నున్న యుద్యోగస్థులతో నేను ప్రభావతితోఁ జతుగంగ మాడెదననియు నచ్చటికిఁబోవ నుత్తరమీయవలయుననియుఁ జెప్పుకొనెను.

ఆమాట లాయుద్యోగస్థులు విని అయ్యో కుమారా! నీ రూపముజూడఁ గడువింతగానున్నది. నీకు బ్రతికునం దాసలేదా యేమి? యూరక యేల చావఁ బ్రయత్నించెదవు? అవిగో పుఱ్ఱెలను చూడుము. నీవంటివారే వచ్చి ప్రభావతితోఁ జదరంగమాడి యోడిపోయి యుఱిదీయఁబడిరి. పోపొమ్మని పలికిన నతండు నవ్వుచు అయ్యా నా