పుట:కాశీమజిలీకథలు -01.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

పెక్కెండ్రు గలరు. అతడు స్త్రీలచర్యలు కడుచిత్రములని యెంచి వారిశుద్ధాంతమునకుఁ బోతుటీఁగనేనియుఁ బోకుండఁ గాపుపెట్టించెను. ఆ చేప మగదియైనచో లోనికిఁ బంపఁగూడదనియే యట్లడిగెను.

ఆ పల్లెవాండ్రు రాజుతో నయ్యా! చేపలలో స్త్రీ పురుష వివక్షత గనిపెట్టుట కష్టము. ఇది యాడుదో మగదో మాకుఁ దెలియదని జెప్పిరి. ఆ మాటలు విని యీ రాజు దాని నంతఃపురమునకుఁ బంపవచ్చునా? పంపకూడదా? యని యాలోచించుచుండ సగము ప్రాణముతోనున్న యా చేప పక్కున నవ్వి గిలగల కొట్టుకొని కొంత సేపటికి బ్రాణములు విడిచినది.

ఆ చేప నవ్వుట చూచి సభవారెల్లరు వెరగుపడిరి. అప్పుడా రాజు సందేహ మందుచు మంత్రిం జూచి యార్యా! ఈ చేప యేమిటికై నవ్వెనో చెప్పఁగలవా? యని యడిగెను. ఆ మాట విని ప్రభుకీర్తి. రాజా! సాధారణముగా మనుష్యులు నవ్విన కారణమే తెలిసికొనుట దుర్ఘటనము. మఱియు విజాతియైన చేప నవ్విన కారణ మెవ్వఁడు చెప్పఁగలడు? తఱచు బాలభావముగల రాజు లీలాటిప్రశ్నములే వైచి ప్రధానుల జిన్నపుత్తు రిది తగనిపని యని యాక్షేపించెను.

ఆ మాట విని కోపించి యారాజు మంత్రీ! చేప యూరక నవ్వదు. కారణ మేదియో యుండకపోదు. ఆ కారణము చెప్పుటకై నీకు నారుమాసములు మితి యిచ్చితిని. అప్పటికి జెప్పకపోయితివేని నిన్నుఱి దీయింతునని కఠినముగాఁ బలికి సభ చాలించి యప్పుడే యతం డంతఃపురమునకు బోయెను.

అప్పు డచ్చటివారెల్ల రాజశాసనము కడుక్రూరముగా నున్నదని నిందించిరి. మంత్రియు నేమియుంబలుకక చిన్నబోయి రాజుగారి నొవ్వనాడుటచేతనే యిట్టియాజ్ఞ యిచ్చెనని పశ్చాత్తాపమందుచు విచారముతో నింటికిఁబోయి చింతాసదనంబునం బండుకొని పెక్కుతెరంగుల ధ్యానించుచుండెను.

కొంతసేపునకు భోజనమునకు లెమ్మని పరిచారకలువచ్చి పిలచిరి. అతఁడు వారికి నుత్తరమే చెప్పలేదు. దాన శంకించుకొనుచు వాండ్రు అతని భార్యతో నా మాట చెప్పిరి. అప్పుడప్పడఁతి పతియొద్దకు వచ్చి భోజనమునకు లెమ్మని పిలిచినది. ఆమె మాటలు బాటింపక చింతిపుచుండెను. పిమ్మట నామంత్రికూఁతురు లవంగి యనునది మాతృబోధచేవచ్చి తండ్రిని లేపెను. దానితో నతఁడు నేను భోజనము చేయను. మీరు భుజింపుఁడు అని మాత్రమే చెప్పెనుగాని యెంత యడిగినను కారణము చెప్పఁ డయ్యెను.

అప్పు డాలవంగి ప్రద్యుమ్నుఁడను తన యన్నయొద్దకుఁబోయి అన్నా! మన తండ్రి యెద్దియో విచారముతో నుండి భోజనమునకు లేవకున్నాడు. ఎవరుపోయి