పుట:కాశీమజిలీకథలు -01.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

280

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

బ్రతికింపలేవా? నాకై కాదా? నిన్నమ్మవారి నట్టి వరము వేడుకొమ్మనెను. అతని జీవితాంతము వఱకు నా నిమిత్తమే శ్రమపడెను. కటకటా! నేను క్షణములో మేనునిడిచి లోకాంతరమున నతనితో గలిసికొందును అతనితో నీవేమైనం జెప్పగల వార్తలుండిన వక్కాణింపుమని యనేక ప్రకారముల శోకించుచుండెను.

మగఁడు పరదేశమందుండి రాకున్న దుఃఖించుచు శక్తికి నతఁడు వచ్చినతోడనే తన ప్రాణంబుల బలియియ్య మ్రొక్కి యట్లు చేయబూనిన సాధ్వి నిజముగా మగఁడు రాయిగానున్న సమయములో నెంత చింతించునో యూహింపఁదగినదే! ఆ సుగుణావతి శోకముతో నా రాయిం గౌఁగలించుకొనుచుఁ గామపాలునికన్న ముందే ప్రాణములు విడువఁ దలంచెను.

ఆ సమయంబునఁ గామపాలుం డయ్యో! తనకు మిత్రహత్యయేగాక స్త్రీహత్యగూడ సంప్రాప్తించునని వెరచుచు నా తరుణిం బట్టుకొని శోకోపశమనంబు జేయుచు నిట్లనియె.

సాధ్వీ ! మనిద్దర మితనికై మూరక చచ్చిన నేమి లాభమున్నది? అతని బుద్ధి బలమునే నన్ను బ్రతికించుకొనెను. మనముగూడ నీ యడవిలోఁ దపముజేసి యతని శిలాత్వము బాపుదము. నీ చిత్తశుద్ది వలన నతండు తప్పక బ్రతుకగలఁడు. నీవిందు నిష్టబూని యుండుము. నేనును యోగం బవలంబించి యుండెదనని చెప్పిన నప్పడతియు నతండు చెప్పిన యుపాయమునకు సంతసించుచు నప్పుడె శృంగారవేషంబు దీసి పారవైచి యోగిని వేషము వైచుకొని యా ప్రాంతమందే తపము జేయుచుండెను. కామపాలుండును ఆ సేనతోఁగూడ జిత్ర సేనను బుట్టినింటికనిపి యోగియై యాయడవి యందే సంచరించుచుండెను.

గోపా ! నీవు చూచిన రాతివిగ్రహమా బుద్ధిసాగరుని యాకృతిసుమా! వెంట్రుకలు శరీరభిన్నములైనవి కావున శిల కాలేదు. దానంజేసి రాతివిగ్రహమునకు జుట్టు యున్నది. ఇదియే దీని వృత్తాంతము అని చెప్పిన మిగుల సంతసించుచు నా గొల్లవాడు అయ్యో! పాప ముపకారము జేయఁబూనిన బుద్ధిసాగరుఁ డిట్లు ఱాయియయ్యెనే! కటకటా! యీతం డీలాగున నెంతకాల యుండఁదగినది? వీని కెప్పటికేని శాపవిమోచన మగునా? త్రికాలవేదులైన మీరెఱుంగగాని యర్థం బుండదని అడిగిన వాని దయాహృదయంబునకు సంతసించుచు నమ్మణిసిద్ధుం డిట్లనియె.

గోపా! నీకు సంతసమేని వానికి నిజరూపము వచ్చునట్లు నేను చేయఁగలను. చూతువుగాని రమ్మని యతనితోఁగూడ నా శిలావిగ్రహము కడకుఁబోయి దానిపై మంత్రాక్షతలు జల్లినంత బుద్ధిసాగురుఁడు పాషాణత్వము విడిచి నిజరూపము ధరియించి యమ్మణిసిద్ధునిచే దనకు శాపవిమోచనమైనట్లు తెలిసికొని యతని పాదంబులంబడి యనేక ప్రకారముల వినుతించెను. అమ్మణిసిద్దుఁడు బుద్దిసాగరుని లేవనెత్తి గారవించి తన శిష్యునికిఁ దెలియుటకై యతనిచే నతని వృత్తాంతమంతయు మరలఁ జెప్పించెను.