పుట:కాశీమజిలీకథలు -01.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రసేన కథ

279

నవి తాను గ్రహించిన విధంబును భార్యచేతిలో మృతినొందుటయు మరల నా పక్షులే తాను దేహబాదకై గూర్చుండియుండగా, జెట్టుమీద వ్రాలి సంభాషించుకొనిన మాటలు నందులకై నాలుకకు గుడ్డకట్టుకొని యా విషం బద్దిన విధముఁ జెప్పి మిత్రడా! యీ రహస్యము పక్షి శాపభీతిచేఁ చెప్పకుంటిని. ఇదియేసుమీ కారణము నాయం దనుగ్రహ ముంచుమీ యనుచుండ నంతకుమున్నె పాదములు మొదలుకొని వ్యాపించుచున్న పాషాణత్వము వక్త్రభాగము నాక్రమించుటచేఁ బిమ్మట మాట్లాడుటకు వీలులేక పోయినది.

అట్లు జరిగిన కథయంతయుజెప్పి పక్షి శాపంబున రాయియైయున్న బుద్దిసాగరుని యాకారమునుఁజూచి కామపాలుఁడు గుండెలు బాదుకొనుచు అయ్యో! మిత్రుడా! నిన్నూరక నిందించితినే! కటకటా! నావంటిపాపాత్ముఁ దెండయిన గలడా? అన్నన్నా! యుపకారము చేసిన నిన్నూరక రాయిగాజేసిన నాపాతకంబున కంతముండునా యమ కింకరులు నన్నేరకమునఁ బడవైచి వేధింతురో! అయ్యో తెలిసికొనలేకపోతినే? యీ వచనాంతమే జీవితాంతమంటివి. చీ! చీ! నా యీర్ష్య నన్నంత శ్రద్ధగా విననిచ్చినది గాదు. స్త్రీమూలముననేగదా నాకీ యాపద వచ్చినది. కపటస్వభావముగల యొక స్త్రీ నిమిత్తము ప్రాణమువంటి మిత్రుని జంపుకొనిన నావంటి మూర్ఖు డెందేని గలడా? నిజముగా నతనికట్టి యుద్దేశమున్నను నా చిన్నదానిని సమర్పింపకుండవచ్చునా? దాని నా కతండేగదా పెక్కిడుములుపడి సంఘటించెను. అక్కటా! నాకై యతఁడుపడిన పాటు తలంచుకొనినంత శరీరము వివశమగుచున్నది. సీ! ఇటువంటి మిత్రుని జంపి బ్రతికియుండుటకంటె నీచమున్నదా యని తలఁచుచు బుద్ధిసాగరా! యని పెద్దయెలుంగున నేడ్చుచు నతని పాదంబుల తన తలవైచి బద్దలుగొట్టుకొనఁబోయెను.

అప్పు డతని సాహసమునకు వెరచి చిత్రసేన వచ్చి చేతులు బట్టుకొని యనేక విదముల నోదార్చినది. ఆ మాటలేమియు బాటింపక బోఁటీ! దూరముగా నుండుము. మిత్రఘాతకుండగు నన్ను ముట్టకుమని పలుకుచుఁ దన తల నూరక యతనిపాదంబులం వైచి రక్తంబుగారఁ గొట్టుకొన దొడంగెను.

ఆ వృత్తాంతమంతయును విని సుగుణావతి గోలుగోలున నేడ్చుచు గుండెలు బాదుకొనుచు నచ్చటికివచ్చి శిలారూపముగానున్న బుద్ధిసాగరునిగాంచి హా ప్రాణనాథా! యని పెద్దకేకలుపెట్టి యా విగ్రహమును గౌఁగిలించుకొన బిట్టుగా నేడువఁ దొడంగినది. ఆ సుగుణావతిం జూచి కామపాలుఁడు అయ్యో సాధ్వీ! నీ మగని నిష్కారణముగా జంపితిని. పాతివ్రతధర్మముచేత నన్ను బ్రతికించితివి. నీవు నీపతిని