పుట:కాశీమజిలీకథలు -01.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నట్టి కోపమునఁ దనతో మాట్లాడుకున్నను బుద్ధిసాగరుఁడు కోపింపక నతనితోడనే విడువక పోవుచుండెను. అట్లు బుద్ధిసాగరుడు తన్ను విడువక వచ్చుచుండఁ జిత్రసేనయొక్క బోధచేఁ గామపాలుం డొక్కనా డటుపైనఁ దనతో రాఁగూడదని భృత్యముఖంబుగాఁ దెలియజేసెను. కటకటా! రాజులు దుర్మదాంధులుగదా! అందులకు జింతించి బుద్ధిసాగరుం డయ్యా! నాకీ యాపద యేటికి వచ్చినది? నిజము చెప్పిన నేను శిలయగుదును. చెప్పనిచో నా మిత్రునికి నాయందుఁ గోపము విడువక బెరుగుచున్నది. ఏమి చేయుదును? యిట్టి చింతతో మిత్రునికి శత్రువునై యుండుటకంటె రాయిగా నుండుటయే మేలని తోచుచున్నది.

కామపాలునికి నాయందుఁ గినుక యుండుట తప్పుకాదు. తన భార్యను గామించిన వానియం దెవ్వరికి నీర్ష్యయుండదు? దైవాగతమైన యా సూక్ష్మ మెఱింగికొన నతనికి శక్యమా? ఇంతకు నాపురాణకృతం బిట్లున్నది. యథార్థము జెప్పినచో నిప్పుడు నేను బొందు దుఃఖమతనికిఁ రాగలదు. నాకు శిల యయ్యెడు యోగమున్నది. విధిగతి మహానుభావులైన రాజులే దాటలేకపోయిరి. ఇక మాబోటివారన నెంత.

శ్లో॥ రామేప్రవ్రజనం బలేర్ని యమనం పాఁడోస్సుతానాం వనం
      వృష్టీనాంనిధనం నలస్యనృపతే రాజ్యాత్పరిభ్రంశనం
      కారాగారనిషేవణంచ మరణం సంచిత్యలంకేశ్వరే
     సర్వః కాలవశేన నశ్యతి నరః కోవా పరిత్రాయతే.

అని యనేకప్రకారముల నాలోచించుకొనుచు మెల్లన నతనియొద్దకుఁబోయెను. కామపాలుండును వానిమోము చూడనొల్లక పెడమొగముపెట్టి యతనితో మాట్లాడ లేదు. అట్టి యవమానమునకుఁ జింతించుచు బలాత్కారముగా నతనిచేయి పట్టుకొని మిత్రుడా! నీకు నాయందిట్టి యసూయ యుండదగినదే కాని నా చెప్పబోపు మాటలువిని పిమ్మట నీ యిష్టము వచ్చినట్లు చేయుము. పూర్వస్నేహమునైనను స్మరించి నా వచనంబులు సాంగముగా నవధరింపుము. నావచనాంతమే మదీయజీవితాంతముతోఁగూడ నీ స్నేహాంతమగుచున్నదని పలికినఁ గామపాలుం డీర్ష్యతోడనే యందలి యర్ధంబు గ్రహింపలేక యది యెద్దియో చెప్పుమనునట్లు శిరఃకంపముతో సూచించెను.

పిమ్మట బుద్ధిసాగరుఁడు గన్నుల నీరునించుచుఁ గామపాలునితో శ్రీరంగపుప్రాంతమం దారామములో శయనించియుండఁ బక్షులు చెట్టుమీఁదవ్రాలి సంభాషించి కొనిన తెరంగును కోటబురుజు విరిగినరీతియు భోజనసమయమున తొలిముద్దయందు జేపముల్లు వచ్చుటయు, దాంబూలములోఁ బురుగు లుండుటయు