పుట:కాశీమజిలీకథలు -01.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుగుణావతి కథ

275

నెలఁత వల్లెయని క్రమ్మర సత్వరముగాఁబోయి తనకై వేచియున్న కాళిని మగఁడు జెప్పిన వరమిమ్మని యడిగినది.

ఆ యమ్మవారు నవ్వుచు జననీ! నీవు కోరిన వరము నా కసాధ్యమైనది. జీవులు పూర్వజన్మకర్మానుగుణ్యముగా మృతినొందుచుందురు. అట్టిదానిని మార్చుటకు నా తరంబుగాదు. అయినను నీ యందుగల తాత్పర్యంబునం జేసి యిచ్చుటకు బుద్దిపుట్టుచున్నది. నాకుఁగల శక్తి యంతయు వినియోగపరచి నీవు ముట్టినంత నొక్కడు మాత్రము బ్రతుకునట్లు వరమిచ్చితిని. ఆ పిమ్మట నా వరము చెల్లదు. ఇంతకన్న నాకు శక్తిలేదు. పోపొమ్మని పలికి యమ్మవారు అంతర్ధానమైనది. పిమ్మట నా కొమ్మయు సమ్మోదమంది యతిరయంబునఁ బతియొద్దకువచ్చి యావర్తమానము తెలియఁజేసినది.

అతండును సంతసించుచుఁ గాంతతో ముచ్చటలాడి చేడియా? నే నీ మధ్యను కాశీపురంబున కరిగితిని. అందుండి నీకై కొన్ని వింతవస్తువులు తీసికొని వచ్చితిని. ఆ పెట్టెలోనున్నవి తీసుకొనుమని చెప్పి తాళము చెవి నిచ్చెను.

ఆ బోఁటియు నతిప్రీతితో నా బీగము తీసి పేటికలో చేయిపెట్టి తడిమెను. ఆ సుందరి చేయి తగిలినతోడనే కామపాలుడు నిద్రమేల్కొనిన వానివలె నాపెట్టె నుండి లేచెను. అదిచూచి యా చిన్నది జడిసి బాగు బాగు ప్రాణనాథా! యిందులో నెవ్వరినోయుంచి నగలని నాతోఁ జెప్పితిరా? నేను జడిసితిసుఁడీ! దీనిలోని వారెవ్వరని యడుగుచుండగనే యందుండి లేచి కామపాలుఁడు బుద్ధిసాగరుని యొద్దకు వచ్చి యా సుగుణావతియే తన భార్య పద్మావతి యనియు నది తన యత్తవారిల్లే యనుకొని యక్కలికి నతని ప్రక్క నుండుటకు మిక్కిలి శంకించుకొనుచు నతని కిట్లనియె.

ఆర్యా! నీ వింత పాపకృత్యమున కొడిగట్టితివేల ? నేను నిద్రబోవుచుండగా నా ప్రక్కజేరి నా భార్యతో మాటాడవచ్చునా ? అట్టి యభీష్టమున్నచో నాతోఁ జెప్పరాదా! నేనే యెప్పింతునే యని కొన్ని నిందావాక్యము లాడెను. అప్పుడు బుద్ధిసాగరుఁ నవ్వుచు నతనితో నతఁడు పరుండి నిద్రపోయినది మొదలు పెట్టెలోనుండి లేచువరకు నడుమ జరిగిన చర్యలన్నియుఁ దెలియజేసి యా చిహ్నముల నెల్ల చూపించుచు మిత్రుని గాఢాలింగనము జేసికొని కన్నుల నానందబాష్పములు గార్చెను.

ఆ వృత్తాంతమంతయు విని కామపాలు డొక్కింతసేపు నిశ్చేష్టితుఁడై యూరకుండి శిరఃకంపము జేయుచుఁ బుద్ధిసాగరుఁడు తన్ను గురించి జేసిన గృత్యములవేఁ తెరంగుల స్తుతిజేయుచు నిట్లనియె. తమ్ముడా మనమువచ్చి పెద్దకాలమైనది. మన తల్లిదండ్రులు శోకవార్ధి మునిఁగి యుందురు. నాకు వారింజూడ మిగుల దొంద