పుట:కాశీమజిలీకథలు -01.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

రగా నున్నది. మనదేశము పోవలెననుటయు నతండు సమ్మతించి అన్నా! మనము ఒంటిగా బోవుటకంటె భార్యలతోఁ బోయి మన తలిదండ్రులకు వందనము జేసినచో వారు మిగుల నానందింతురు. కావునఁ జిత్రసేన నిచ్చటికిఁ బిలిపించెదను. ఆమె వచ్చిన తక్షణమే పోవుదమనుటయుఁ గామపాలుం డయ్యో తమ్ముడా! నాకు స్త్రీజాతి యం దసహ్యము పుట్టినది. నేనిఁక స్త్రీలను జూడను. నాకు భార్య యక్కరలేదని విరక్తిమాటలు చెప్పెను.

బుద్ధిసాగరు డా మాటలువిని యతనితోఁ గామపాలా! నేనును నీ వలెనే మొదట స్త్రీ జాతియంతయు దుర్మార్గమైనదే నమ్మదగినది కాదని యూహించితిని గాని నా భార్య సుగుణవతి గుణసంపత్తి జూచినది మొదలు అట్టి సంకల్పము మరలినది . స్త్రీలలోఁగూడ యోగ్యులుం యోగ్యులందరిని దృఢముగాఁ జెప్పగలను. దుర్మార్గురాలైన పద్మావతి తాను జేసిన పాపమునఁ దానే చెడిపోయినది. చిత్రసేన మిగుల సాధ్వి యని చెప్పగలను. ఇప్పు డప్పడఁతిని రప్పింతునని చెప్పి యెట్టకేల కతని నొడంబరచి యప్పుడే నమ్మకముగల పరిచారకుల నత్తరుణిఁ దీసికొనివచ్చుటకుఁ బంపెను.

రాజకింకరులు తదాజ్ఞానుసారముగాఁబోయి చంద్రగుప్తునకుఁ గామపాలుని యుత్తరమును జూపించి యెక్కుడువిభముతో నామెం దోడ్కొనివచ్చిరి. కామపాలుఁడు చిత్రసేనం గలిసికొని తమపడిన యిడుమలన్నియుఁ జెప్పుకొనుచుఁ గొన్నిదినంబు లందుండెను. ఒకనాడు శుభముహూర్తమున బుద్దీసాగరుఁడు గామపాలుఁడు భార్యలతో దమ దేశమునకై ప్రయాణముచేసి నడుమ నడుమ శిబిరములు వైచికొని విశ్రమించుచుఁ బోవఁజొచ్చిరి. ఒక్కనాఁడు మధ్యాహ్నమున నొకతోటలో బస చేసిరి. అప్పుడు బుద్ధిసాగరుఁడు దేహబాధకై కొంచెము దూరముగా బోయి యొక చెట్టుక్రిందఁ గూర్చుండెను. అట్టి సమయంబునఁ బూర్వము వచ్చిన పక్షులు రెండును ఆ చెట్టుమీఁద వ్రాలి యిష్టములగు పలుకులు చెప్పుకొనఁ దొడంగినవి.