పుట:కాశీమజిలీకథలు -01.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నా భర్తకు గొంచెము నిద్ర పట్టగానే వచ్చి యతనిం గడతేర్చి నన్నుఁ దనతో సంభోగింపుమని బలాత్కారము చేయుచున్నాడు. ఇప్పుడు మీరు వచ్చినంత నేమియు నెఱుఁగనివానివలె నతినిపైఁ బడి యేడ్చుచున్నవాఁ డిదియే జరిగిన కథయని గోలుగోలున నేడువదొడంగెను. అప్పుడు కొందరు బోయి శ్రీరంగరాజుతో నావర్తమానము జెప్పిరి. అతండు గుండెలు బాదుకొనుచు సకలబంధుపరివృతుఁడై యంతిపురమునకు వచ్చి కూఁతుం గౌఁగలించుకొని యొకపెట్టున నేకస్వరముగా నేడువదొడంగిరి.

అప్పుడు రాజు పద్మావతి చెప్పిన మాటలన్నియు నిజమేయని నమ్మి పట్టరానికోపముతో నొడ లెరుంగక మిత్రునిపైఁ బడియున్న బుద్ధిసాగరుని లేవనెత్తించి యేమిరా? మిత్రద్రోహి! నిన్నుఁ బ్రాణమిత్రుడని నమ్మి వెంటఁబెట్టుకొని వచ్చినందులకు వీనికి మంచి యుపకారము చేసితివి. ఈ దొంగ యేడుపుల కేమిలే? నీ మొగము చూచినంత మహాపాతకములు సంప్రాప్తించు నిన్నేమిచేసినను తప్పులేదు. మా కొంప ముంచితివి అని యనేక నిందావాక్యము లాడెను. బుద్దిసాగరుఁడు శోకముచేఁ దెలివి తప్పియున్నకతంబున నతనిమాట లేమియు వినిపించుకోలేదు.

పిమ్మట శ్రీరంగరాజు కొంతసే పట్లు చింతించి యూరక కామపాలునిపైఁ బడి యేడ్చుచున్న పద్మావతి నూరార్చి పేర్చిన క్రోధమున బుద్ధిసాగరుం దీసికొనిపోయి యుఱిదీయుఁడని కింకరుల కాజ్ఞాపించెను. యమకింకరులం దిరస్కరించు రాజభటులు మఱునాఁడు బ్రొద్దున నహంకారముతో నతని రెక్కలకుఁ ద్రాళ్ళు బిగించి వీధుల వెంబడి ద్రిప్పుచు వీఁడే మిత్రద్రోహుఁడు చీ యని చూచినవారెల్ల నుమియుఁ గ్రమంబున నతని వధ్యభూమికిఁ గొనిపోయిరి. బుద్ధిసాగరుం డావిషయ మేమియు నెరుంగక పిశాచము పట్టినవానివలె వారితో నడిచెను. అంత వధ్యభూమియందు నుఱిదీయబోవు సమయంబున రాజభటులు బుద్ధిసాగరుని వాడుక ప్రకారము ఓరీ! క్రూరాత్మా! ని న్నిప్పుడు ముఱి దీయఁబోవుచున్నారము. బ్రతుకుదప్ప నెద్దియేని కామిత మున్న గోరుకొమ్ము. ఇత్తుమని గట్టిగా బలుకుటయు నప్పటికిఁ గొంచెము స్పృహ వచ్చి బుద్ధిసాగరుఁడు వారితో నిట్లనియె.

అయ్యో నే నేమి యపరాధము చేసితిని! న న్నేమిటి కురిదీయుచున్నారు? మఱియు నే నిచ్చటి కెట్లువచ్చితిని? నా ప్రాణమిత్రుడు డేడి? యని యడిగిన వారు ఓహో! నీ దొంగవేషమున కేమిలే' నీవు ప్రాణమిత్రుని జంపినందుకుగాను శ్రీరంగరాజు నీకు మరణదండన విధించెను. ఇది వధ్యభూమి. నీవు నీ వార్తయే యెఱుఁగకున్నావు. ఈసారి తెలిసినదా? నీకు మఱి గామిత మేదేని గలిగిన వక్కాణింపుము.