పుట:కాశీమజిలీకథలు -01.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మావతి కథ

269

యీ కత్తి తీసికొనిపోయి వానిని వధింపుము. మన కే యాటంకము నుండదు. అని చెప్పిన విని యవ్వనిత సంతసించుచు ఔనుసుమీ! ఈపని యెంతయు నుచితముగానున్నది. బుద్ధిసాగరుఁడు గూడ నంతఃపురమున బరుండుట మనకొక యుపకారమైనది. నేను తరువాతఁ జెప్పెదనులే! యీ కత్తి నూరినదే గదా! యిటు తెమ్ము. వేగఁబోయెదనని యా కత్తి నందిపుచ్చుకొని రివ్వున మరలి సొరంగములోఁ బ్రవేశించినది.

అది యంతయుఁ జూచుచున్న బుద్దిసాగరుఁడు దానిచివరమాట విని తానే ముందరబోయి కామపాలుని లేపఁదలచెనుగాని దైవసంకల్పమున నాసొరంగములో దాని యడుగుముందు వాని యడుగు వెనుక యగుటచే వడివడిపోయి యేమియుం దెలియక గాఢనిద్రావశంవిదుఁడై యున్న కామపాలుని మెడమీద నాగత్తి వైచి చంపెను. స్త్రీ సాహసము ఎంత ఘోరమైనదో.

శ్లో॥ సుఖదుఃఖ జయపరాజయ జీవిత మరణానియే నిజావంతి।
     ముహ్యంతి తేపిసూనం తత్వవిదశ్చాపి చేష్టితై స్త్రీణాం॥

శ్లో॥ స్మరోనమమపిప్రాప్య వాంఛంతి పురుషాంతరం।
     నార్యస్సర్వస్యభావేన నోహంతె హతదాశయాః॥

సుఖదుఃఖ జయపరాజయ జననమరణముల మహిమ దెలిసికొనిన మహానుభావులు సైతము స్త్రీచేష్టలకే మోహమును బొందుదురు. మఱియు మన్మథుండు మగడైనను పురుషాంతరునిఁ గోరుచుందురు. వారిచిత్తవృత్తి దెలిసికొన నెవ్వనితరంబు.

అట్లు తాను వెళ్ళుసరికే యతనిఁ గడదేర్చినది. కాన నేమియు జేయలేక హా మిత్రుడా! నన్నొంటి విడిచి పోయితివేయని ఘోరముగా నేడువ దొడంగెను. పద్మావతి యప్పుడు అతని గదిలోనుండియే వచ్చెననుకొనెను? తనవెంట వచ్చి తనగుట్టంతయుఁ జూచిపోయెనని యింతయేని యెరుంగదు. గోపా! పిమ్మట నాచిన్నది చేసిన కృత్యము వింటివా? మేనంతయుఁ జీరికొని నగలన్నియు విరజిమ్ముచు అయ్యో! చెలులారా! రండురండు యీ బుద్ధిసాగరుండు నామగనిం జంపి నన్ను బలాత్కారముగాఁ బట్టుచున్నాఁడు. వేగము రండో యని యరచినది.

ఆ కేక విని ప్రాంతగేహములోనున్న సఖులు సఖీ! వెరవకుము వెరవకుము. మేము వచ్చుచున్నామని మరల గేకలుపెట్టి యతివేగముగా నచ్చటికివచ్చి చచ్చిపడి యున్న కామపాలునిపై బడి యొడలెఱుంగక దుఃఖావేశముతో నేడ్చుచున్న బుద్ధిసాగరుని నా గదిలోనే నేడ్చుచు వికారముగానున్న పద్మావతిం జూచి యిది యేమి పాప మితం డిట్టు చచ్చెనేమి యని యడిగిరి. అప్పుడు పద్మావతి వారితో అక్కలారా! నేనేమి జెప్పుదును? ఈ దుర్మార్గుం డంతఃపురములోఁ దనకుఁగూడ మంచమువేయు మనిన నేను మైత్రిచే విడువలేక యట్లనుచున్నా డనుకుంటిని గాని యింతజేయునని యెఱుఁగనైతిని.