పుట:కాశీమజిలీకథలు -01.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మావతి కథ

271

దానిందీర్చి శీఘ్రముగా నుఱితీయుదుము అనుటయు నా మాట విని బుద్ధిసాగరుండు ముక్కుమీఁద వ్రేలు వేసికొని రాజకింకరులారా! నా ప్రాణమిత్రుని నేనే చంపితినని మీ రాజు నాకు మరణదండన విధించెనా? మేలు మేలు బాగుబాగు. చక్కగా నిధానించెనే? కానిమ్ము నాకు నీ సమయమందు మరణమే యుచితముగా నున్నది. అట్లయిన వేగ నురిదీయుఁడు నా చెలికానితోఁ గలిసికొనియెదనని తొందరపెట్టెను.

అప్పుడు వాండ్రలోఁ గొందరు బుద్ధిమంతులు వానిమాటలధోరణిచే నేరము చేసినట్లు నమ్మక అయ్యా! నీ వూరక చావనేల? నిజముగా నీవు నేరము జేయనిచో నామాట రాజుగారికి నిదర్శనము చూపుము. నిన్ను విడిచిపెట్టెద రనుటయు బుద్ధిసాగరుఁ డొక్కింత చింతించి చావనిశ్చయించియు నూరక నిందమోసి మృతినొంద నేటికి? నిక్కము బయలుపరచిన పిమ్మట సమసెదంగాక యని తలంచి యా కింకరులతో నిట్లనియె.

భటులారా! అట్లయిన నన్ను మీరాజునొద్దకు తీసికొనిపొండు. పిమ్మట నతనితో నిజము చెప్పెదనని కోరెను. ఆ కోరిక ప్రకారము మతని మరల శ్రీరంగరాజునొద్దకుఁ దీసికొనిపోయి వాని యభిప్రాయము మెఱింగించిరి.

రాజు అహంకార ముఖముతో బుద్ధిసాగరునిం జూచి పాపాత్మా! నీవు నాతోఁ జెప్పవలసిన మాట యేదియో వేగముగా వినిపింపుము. నీ మొగము చూడరాదని పలికెను.

అంత బుద్ధిసాగరుఁడు దీనస్వరముతో రాజా! నా ప్రాణమిత్రుఁడు గామపాలుండు మృతిజెందియుండ నా కీయురిశిక్ష యుచితముగానే యున్నది. ఊరకట్టి నిందమోపి చావరాదని యూహించి యందలి నిజము మీకు వినుపించుటకై వచ్చితిని. మొదట నేను శోకావేశముతో నుండుటచే మీచర్య లేమియు గ్రహింపలేకపోయితిని. ఇప్పుడు నా వెంట నంతఃపురమునకు రండు. అందలి యథార్థమంతయుఁ బ్రత్యక్షపరతు ననుటయు నా రాజు దెల్లఁబోయి వల్లెయని యప్పుడే యతనివెంట గూఁతు నంతిపురి కరిగెను. బుద్ధిసాగరుఁడు రాజును బద్మావతి గదిలోనికి తీసికొనిపోయి యందు మూలగానున్న కవాటము తెరచి యానేల సొరంగము జూపించి దానివెంబడి తనతో రమ్మని చేయి వీచుచుఁ గ్రమంబున నతని నామేదరి యింటికి దీసికొనిపోయి యందు తనపేరుతోనున్న బంగారుబళ్ళెరములు, వెండిగిన్నెలు, నగలు మొదలగు వస్తువులన్నియుం జూపించి కామపాలుని నరికిన కత్తిని రక్తమిళితమై యచ్చటనే బడియున్న దానిం గైకొని పరిశీలించి యా చిహ్నముల రాజునకుఁ జూపించుచు రాత్రి జరిగినకథ యంతయు నతనితోఁ జెప్పెను.