పుట:కాశీమజిలీకథలు -01.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అప్పుడు బుద్ధిసాగరుఁడు మొగమునందు దైన్యము దోపనీయక యతని దాపుననే భోజనమునకుఁ గూర్చుండి కామపాలుని మొదటే ముద్దఁజేసికొని తినఁబోవు సమయంబున నతని చేయి బట్టుకొని అన్నా! నాకీ ముద్దబెట్టుము దీనిం దిన వేడుక యగుచున్నది . నీకును నాకును నెంగిలిలేదు అని వినయముగాఁ బ్రార్థించిన నతండు నవ్వుచు మిత్రుఁడా! దీనికై నన్నింత బ్రతిమాలవలయునా? యిదిగో బుచ్చుకొమ్మని యిచ్చుటయు దాని నతండు దినక పిమ్మట బ్రచ్ఛన్నముగా దాచెను.

అట్లు ఇష్టగోష్ఠి మాటలాడుకొనుచు భుజించిన వెనుక బుద్ధిసాగరుఁడు కామపాలునితో రహస్యముగా నిట్లనియె. అన్నా! నీవును నేనును నిల్లు విడచినది మొదలు విడవకుండ నొక్కశయ్య బండుకొనుచుంటిమి. నాకు నేఁడు గాలిసోకినదేమోగాని శరీరములో భారముగా నుండుటయేగాక మనమున నెద్దియో భయము గలుగుచున్నది. రాత్రి నీవు నీ భార్యతోఁ బరుండవలసినదేగదా? నే నొక్కరుండ నెక్కడ బండు కొందును. అనుటయు నతండు తొందరపడి ఆయ్యో మిత్రుఁడా ! నాకు నీకంటె పద్మావతి యెక్కువదియా! నీవు వెరవకుము. నేను తోటలోఁ బరుండి లేచినది మొదలు నీమొగము బరీక్షించుచునే యుంటిని. విపరీతముగానే యున్నది. దారిలో గాలిసోకి యుండవచ్చును . విభూతి పెట్టించి యీరాత్రి నీయొద్దనే పండుకొనియెదనని పలికెను.

అప్పుడా బుద్ధిసాగరుఁ డన్నా! అట్లనకుము. చిరకాలమున కిచ్చటికివచ్చి భార్యం జూడక వేరుశయ్యని బండుకొనిన బంధువులు సమ్మతింతురా? పోనీ! యొకటి చేయుము. నీవు నాకతంబున భార్యయొద్దఁ బవళింప మానవలదు. నీ గది దగ్గరే నాకుఁగూడ మంచము వేయించుము. నాకు ధైర్యముగా నుండును అనిన అతండు నెచ్చెలీ దీనికి సంశయమేల! నా గదిలోనే పరుండవచ్చును . నీకును నాకును భేద మున్నదా! యని పలికెను.

బుద్ధిసాగరుం డతనితో అన్నా! మన యిరువురకు నెంత మైత్రి యున్నను నొక్కగదిలోఁ బవ్వళింపరాదు. నీ కిష్టమైనచో నీ భార్య పద్మావతి సమ్మతించునా! ఇతరులు వినినఁ బరిహాసాస్పదముగా నుండును. నీ గదికి దాపుగ నాకు మంచము వేయించుటయే లెస్సయని పలికి యతని నొప్పించెను.

కామపాలుండు అంతఃపురచారిణుల కామాట దెలియజేసిఁ తన గదినిచేరియున్న గదిలోనే యతనికిఁగూడ మంచము వేయించెను.

అంత నంతఃపురకాంతలచే బిలువంబడి కామపాలుఁడు బుద్ధిసాగరునితోఁ గూడ నధికాలంకారశోభితంబగు శుద్దాంతమున కరిగినఁ పద్మావతి యెదురువచ్చి మగని చెట్ట బట్టుకొనియున్న బుద్ధిసాగరుం జూచి కొంచెము తొలఁగెను. కామపాలుం డట్టి సందియము ముందుగానే పోగొట్టెను. ఆ ముద్దియయుఁ దద్దయుం బ్రీతి బతిపాదంబులం