పుట:కాశీమజిలీకథలు -01.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రసేనకథ

265

ఱాయి యగును సుమీ యని పలుకుచు నాపక్షి యాఁడుపక్షితోఁగూడ నెగిరి యెక్కడ కేనిం బోయినది.

పక్షిభాష గుర్తెరింగిన బుద్ధిసాగరుండా సంవాదమంతయు నాలించి పిడుగుపడినవానివలె నిశ్చేష్టితుండై అయ్యో! యిది యేమి పాపము నా కిట్టి ఘోరవార్త వినంబడిన దేమి? ఇదివరకు మాదినము లనుకూలముగా వెళ్ళినవి. మేము ముట్టినదెల్ల బంగారమే యగుచున్నది. ఇప్పుడు జెడుదినములు వచ్చినవి గాఁబోలు. అక్కటా! ఈయాపద నాకుకాక నా మిత్రునకు వచ్చినదేమి? మిత్రవియోగశోకము నేను భరింపగలనా? పక్షిమాట దప్పదు. మాకుఁ దిరుగ సంతోషముతో నిండ్లకుఁ జేరు యోగము లేదు గాఁబోలు! కానిమ్ము. దైవసంకల్ప మెవ్వడు మరలింపఁగలడు? ఏమి జరుగునో చూచెదంగాక యని ఖిన్నవదనుఁడై విచారించుచుండ నింతలోఁ గామపాలుఁడు మేలుకొని వయస్యా! నేను బరుండి చాలాసేపైనది. నన్ను లేపకపోయితివేమి? నాకొక దుస్వప్నమైనది. మనయింటియొద్ద నెవ్వరికై నం గీడురాలేదు గదా? నీ వెద్దియో విచారించుచుంటి వేమని పలుకుచుఁ దనకు వచ్చిన కలయంతయు నతనితోఁ జెప్పి దీనికి ఫల మేమని యడిగిన నతండు మనంబున విచారించుచు నతనితో నిట్లనియె.

కామపాలా! పగలు వచ్చిన కలకు ఫల మేమియు లేదని పెద్దలు చెప్పుదురు. దీనికై నాలోచింపవలసిన పనిలేదు. సాయంకాలమగుచున్నది పోదము లెమ్ము శ్రీరంగపురము ప్రాంతమునందే యున్నది. మఱియు నే నాలోచించునది యేమియు లేదు దూరమార్గగమనభేదంబునంజేసి నా మొగము నీ కట్లు కనంబడుచున్నది. ఇంతకన్న వేరులేదని లోపలఁ జింతించుచున్నను నతనికి ధైర్యము గఱపుచు నాతోట విడిచి సాయంకాలమున కా కామపాలునితోఁ గూడ శ్రీరంగపురము జేరెను. బుద్ధిసాగరుఁడు కామపాలునితోఁ బ్రస్తుతము శ్రీరంగపురము పోవలదని యెన్నియో విధముల బోధించెనుగాని కారణము జెప్పమి నామాట పాటిసేయక పద్మావతియందలి మోహంబునం జేసి యతండు పోవలయునని గట్టిపట్టుపట్టెను. దానం జేసి వారి కచ్చటికిఁ బోక తీరినదికాదు. బుద్ధిసాగరుఁడు కామపాలునితోఁ గనిపెట్టి కోటప్రాంతము నడచుచు బురుజు దగ్గరకు బోవునంత నొక్కత్రోపు ముందరకుఁ ద్రోసెను. అప్పుడే యా బురుజు పెళపెళ విరిగినదిగాని బుద్ధిసాగరుని త్రోపుచేఁ గామపాలునికిఁ జింతాకంత దప్పినది. అచ్చటనున్నవా రది చూచి కామపాలుని బునర్జీవితునిగాఁ దలంచిరి.

పిమ్మట శ్రీరంగరాజు అల్లుని రాక విని సంతోషముతో నెదురేగి యుచితసత్కారములతోఁ దోడ్కొనిపోయి యప్పుడే యావార్త పద్మావతికిఁ దెలియజేసెను . ఆరాత్రి మంచి పిండివంటకములు ఫలోపహారములు మొదలగువానితో వారికి విందుజేసిరి.