పుట:కాశీమజిలీకథలు -01.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

264

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

ప్రతాపుఁడు చంద్రగుప్తునితో రాజా! నేను పెద్దకాల మిచ్చట నుండను. శ్రీఘ్రముగా వివాహము గావింపుము. వివాహమైన వెనుక వధూవరులం జూచి సంతసించి పోయెద ననుటయు నాచంద్రగుప్తుఁడు మహాప్రసాదమని పలికి దైవజ్ఞులచే మంచిముహూర్తము పెట్టించి యందుఁ జిత్రసేన గామపాలునకు నధికమహోత్సవముగా బెండ్లిగావింపఁజేసెను.

అహా! బుద్ధిసాగరుని యభిఖ్యసార్ధకమైనదిగాదె. అంత బదిదినము లందుండి సూర్యప్రతాపుడు చంద్రగుప్తునితో వయస్యా! మీ యల్లుని మావూరికిఁ దీసికొనిపోయి తిరుగానంపెద నానతియ్యుఁ డనుటయు నతం డందుల కియ్యకొని చయ్యన వచ్చున ట్లల్లునిచే ననిపించుకొని యారాజు సగౌరవముగా ననిపెను.

ఆసేనలతోఁ గొంతదూరముపోయి వారిద్దరు నాలోచించుకొని సేనలకుఁ బోవుటకు సెలవిచ్చి వేషములు యథాప్రకారముగా మార్చికొని యప్పటియట్ల దేశాటనము చేయఁదొడంగిరి.

వీరట్లు కొంతకాలము దేశాటనముజేసి యొకనాడు శ్రీరంగపురసమీపమునకుఁ బోయి యొకతోటలో విశ్రయించియున్న సమయంబున జల్లగాలి వీచుచుండెను. కామపాలునికి నిద్రపట్టినది. బుద్ధిసాగరుఁడు నిద్రరాక యెద్దియో ధ్యానించుచుండెను. ఆ సమయంబున వారున్న చెట్టుమీద రెండుపక్షులు వాలినవి. అందాడుపక్షి మగపక్షి కిట్లనియె.

నాథా! వింతలేమైనం గలిగినచో వక్కాణింపుము. ఉబుసు బోకున్నది అని యడిగిన దానికి మగపక్షి యిట్లనియె.

కాంతా! వింతలేమియు లేవు. ఇప్పుడు మనమున్న చెట్టుక్రింద బండుకొని యున్న కుమారు లిరువురలో రాజకుమారుఁ డత్తవారింటి కరిగినతోడనే పాపము! కోటబురుజు విరిగి మీఁదపడి చచ్చును. ఇవియే విశేషమని చెప్పెను. అప్పుడాపక్షి రేఁడా? అది తప్పినచో నేమి జరుగునని యడిగెను.

దైవికము నాగండము గడిచెనేని యతండు రాత్రి భుజించు సమయంబునఁ దొలిముద్దలోఁ జాపముల్లు గొంతుక కడ్డపడి చచ్చునని మరల మగపక్షి చెప్పెను. ఆ మాట విని యాడుపక్షి ప్రాణేశా! యొకవేళ నవియుఁ దప్పినచో నేమి జరుగునని యడిగెను. అది తప్పిన పిమ్మట నతం డంతఃపురంబున భార్యతోఁ దాంబూలము వైచుకొనుచుండ దొలియాకులో బురుగు తిని చచ్చునని చెప్పెను. ఆడుపక్షి దైవసంకల్పమువలన నదియు దాటినచో నేమగునని పతి నడిగెను. బోఁటీ! అదియునుఁ దప్పినచో నారాత్రియే యతండు భార్యచేతిలో మృతుడగునని మగపక్షి తన్వీ! అది దాటదు, తప్పక యతఁడు భార్య చేతిలోనే చచ్చును, చచ్చును, చచ్చును, అని ముమ్మారు పలికి, తరుణి! మనమాటలు వినినవాడు ఈరహస్యము వానితోఁ జెప్పినను