పుట:కాశీమజిలీకథలు -01.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

260

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

గ్రీడించుచున్నదని విని పరీక్షార్ధమై యర్ధరాత్రంబున నొక్కఁడే యచ్చటికింబోయి తలుపులు బిగించి యుండుట నా కవాటముల యద్దముల పగులఁగొట్టి యా దారిని లోపలకుఁబోయెను. ఆ సమయంబున నాతనికి హంసతూలికాతల్పంబునఁ జిత్రసేన తొడయందుఁ దలజేర్చి పండుకొని యా చేడియ పాడుచున్న వీణాగానంబునకు సొక్కుచు నడుమ నడుమ గుడిచేయి నా నాతి వాతెర నివురుచు నించుక మోమెత్తి చక్కిలి ముద్దు గొనుచుండెడు వారి చిన్నెలన్నియుఁ గనంబడినవి.

అప్పుడు పట్టరాని కోపముతో నా భూపాలకసూనుండు కేల వాలు బూని యుగ్రముగా నతని జంప మీద కుఱికెను. అసడి నంతకు బూర్వమే గ్రహించి కామపాలుడు తటాలునలేచి యతనిం గెలువగల బలము గలిగియున్నను నిలువక వేరొక యద్దము పగులంగొట్టి యా యంతఃపురము దాటి కోట ప్రక్క బుద్ధిసాగరుండు ప్రోగుజేసి యున్న దూదిమీదికి దుమికెను.

ఎంత బలవంతులైనను జారత్వకృత్యమున మెలంగుచున్నప్పుడు సామాన్యులకుఁ గూడ భయపడుచుందురు. సత్యవంతుండు వానిపోకఁ జూచి వెంటదగిలి పోకుము పోకుము యని కేకలు వైచుచు నాతం డరిగినరీతిగానే పోయి యతనితోఁ గూడ గోట గోడ దుమికెను దుమికిన వెంటనే యాదూదిలోఁబడి లేవకున్న సత్యవంతునిం దిరుగఁబడి పట్టుకొని కామపాలుం డతనిచేతనున్న కత్తినే బూని చిత్రవధజేసెను. అంత కామపాలుం డందున్న బుద్ధిసాగరుని లేపి జరిగిన కథ యంతయు నతనితోఁ జెప్పిన సంతసించుచు నప్పుడే యా దూదిరాశిలో నగ్ని యంటించి యతఁడు కామపాలునితోఁగూడ మరల సూర్యప్రతాపుని పట్టణమునకుఁ బోయెను. ఉదయంబున భస్మమైయున్న దూది రాశింజూచి పౌరులందరు బల్జీనిం గానక చింతించుచుఁ బ్రమాదమున నగ్నిపడి భస్మమై దూది చెడిపోయినంత మాటవచ్చునను భయముచే బల్జీ పారిపోయెనని యూహించి యెరుగని వారి కిచ్చినందులకే శాస్తి మనకుం గావలసినదే యని నిందించుకొనుచు బౌరులు చింతించిరి.

మఱునాఁ డుదయంబునఁ చిత్రసేన దనయన్న సత్యవంత్యుడు కామపాలునిం దఱుముకొనిపోయి మృతినొందుట వెనుకనే యఱిగి చూచి చింతించి యంతలో మరలించుకొని యా రహస్య మెవ్వరికిఁ దెలియనీక తండ్రికిట్లు కమ్మ వ్రాసినది.

తండ్రీ ! నిన్న రాత్రి మా యన్న సత్యవంతు డెద్దియో పనికి నా యంతఃపురమునకు వచ్చి యందు నివసించియున్న సూర్యప్రతాపు భార్యంజూచి మోహించెను అతని యభిలాష నేను దెలిసికొని యితరులు రాఁగూడని యీ యంతఃపురమున కేటికి వచ్చితివన్నా యని యడుగుచుండగ యంతలో నతఁడు నిలువలేక నానాళీకవదనపై బడబోయెను. అప్పు డాసాధ్వి వెరచి యటనుండి పరుగున బోయి గోడ దుమికి పారిపోయినది. సత్యవఁతుండు గూడనే బోయెను. ఇరువురు పోయిన పోకయేగాక