పుట:కాశీమజిలీకథలు -01.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

258

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

యడిగెను. అప్పు డాచంద్రగుప్తుఁడు నమస్కరించి దేవా! నేనేమియు నీయనక్కరలేదు. కావలసిన దేవరవారికి లెక్కలు చూపింతు ననుటయు సంతసించువానివలె నభినయించుచుఁ జంద్రగుప్తా? నీ వెప్పుడును గొదువ పెట్టవు. ఈ పైరాజులు సరిగాఁ గప్పములు చెల్లించుటలేదు. నేనచ్చటికిఁ బోవలసియున్నది. అది యరణ్యప్రాంత మగుటచే స్త్రీలు వచ్చుటకుఁ గష్టముగా నుండును. ఇచ్చటనే యుండిన బాగుండునేమో యని తల పైకెత్తి యర్ధస్వరముతోఁ బలికి శిరఃకంపము చేయుచు, పోనీ యేమిటికిని యంతలో నక్కరలేనట్లు సూచించుటయు నతని యభిప్రాయ మెఱిఁగి చంద్రగుప్తుఁడు చేతులు జోడించి వినయముగాఁ గపటసూర్యప్రతాపున కిట్లనియె.

దేవా! దేవరవారి కేను భృత్యుండ ఇప్పుడు నాతో నెద్దియో చెప్పదలంచి సంశయించి యూరకుంటిరి. అట్టి సందియ మందనక్కర లేదు. దేవరపని యేదియైననుఁ బూనుకొని చేసెద సెలవిండు. ఆకార్యముజేసి దేవరఁ కిదివఱకు నాపైఁగల యక్కటికము వృద్ధిజేసికొనఁ దలంచినాఁడనని ప్రార్థించుటయు జంద్రగుప్తుని వచనంబులకు మిక్కిలి సంతసించువానివలె నభినయించుచుఁ జిఱునగవుతో నతని కిట్లనియె.

చంద్రగుప్తా! నీయట్టివాఁడి వేయని యిదివఱకే నేనెఱుంగుదును. మా కార్యము మరేమియులేదు. మేము యిచ్చటికి దేవితోఁ గూడ వచ్చితిమి. ఇటమీఁద నామెను దీసికొనిపోవ నిష్టములేదు. మేము దిరిగివచ్చునంతదనుక మీ యింట నుంచుదమని తలంచుచుంటిని. ఆ నెలతుకయుఁ బ్రాయముననున్నది. మీ యింట నీడుగల వారెవ్వరేనిం గలరా యనియడిగిన నతండు సంతసించుచుఁ గపటసూర్యప్రతాపునితో నిట్లనియె.

దేవా! ఇంతమాత్రమునకే యింత సంశయింపవలయునా! నాకుఁ జిత్రసేనయను కూఁతురుగలదు. అది పదియారేండ్ల ప్రాయముగలది. దానియంతఃపురము మిగులరక్షకముగానుండును.అచ్చటనే దేవిగారుగూడ నివసింపవచ్చును. ఆమెను నేను మాతృభావముగా జూచెదను. ఏకొరంతయు రానీయను. మీరు పోయిరండు పూవులం బెట్టినట్లు మీ భార్యను మీ కప్పగించెదను. ఇప్పుడూరక చెప్పనేల? అప్పుడామెనే యడిగితెలిసికొనుఁడని పలికిన సంతసించుచునప్పుడే మంచిముహూర్తమని యాకపటసూర్యప్రతాపుఁడు స్త్రీవేషములో నున్న కామపాలుని యారాజు వెంటఁ బల్లకీ నెక్కించి కడు జాగ్రత సుమీయని పలుమారు చెప్పుచుఁ జిత్రసేనయున్న యంతఃపురమునకు బంపించెను.

ఆహా! పోతుటీఁగనేని పరీక్ష సేయక లోనికిఁ జొరనీయని చంద్రగుప్తుఁడు స్వయముగానే కామపాలునిఁ జిత్రసేన యంతఃపురమున కనిపెను. ఎట్టి బుద్ధిమంతునకైనను స్త్రీలనుఁ గాపాడుట కష్టము. అంతకుఁ బూర్వమే యా వార్త వినియున్న చిత్రసేన యతనిరాక కెదురుచూచుచు వచ్చినంత నెదురేగి తన యనురాగంబంతయు వెల్లడిగాఁగ బల్లకీలో నుండి లేవనెత్తి గౌఁగలించుకొని సగౌరవముగాఁ దోడ్కొని పోయి యుచితాసనము మీఁద గూర్చుండబెట్టెను.