పుట:కాశీమజిలీకథలు -01.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శరభసాళ్వము కథ

251

నున్నది. దానింజంపినప్పుడుగాని నేను చావను. ఈయడవిలోనికి మనుష్యులు రానే లేరు. ఒకవేళ వచ్చినచో యాచెట్టుతొఱ్ఱలోనున్న యెలుకయునికి యెట్లు తెలుసుకొనగలరు?

తెలిసికొనినను నీచెట్టంతయు నరికినను, నది కనబడదు. ఆ తొఱ్ఱలో నాహారపదార్థము జారవిడిచినచో దానివాసంబట్టి పైకివచ్చును. అది వేరొకలాగున దొరకదు. ఈరహస్యము వారికేమి తెలుయును? మీరందరు నాకు బ్రాణసమానమైన భృత్యులుగనుక చెప్పితిని. మీరు నిర్భయముగా నుండుఁడు. నాకేమియు భయములేదని చెప్పిన యామృగములన్నియు మనంబులం గల యానందమంతయుఁ జేష్టలచేఁ దెలియజేసినవి.

ఈరీతి నిష్టాగోష్ఠి మాటలాడుకొనుచు నామృగములన్నియుఁ దెల్లవారుజాముననే లేచి దేనిజాడ నదిపోయినది. తెల్లవారు నప్పటి కచ్చట నొకటియులేదు. మృగపక్షిభాషావేదులైన యాకుమారులిరువురు నా చెట్టుకొమ్మలసందు నుండి మృగముల సంభాషణమంతయు విని యడలుచు సూర్యోదయమైనంతఁ జూచి యప్పుడు తమ్ముఁ బునర్జీవితులుగా దలంచుకొనిరి.

ఎంత బలవంతులకై నను వింత క్రూరమృగముల నడుమ రాత్రి జిక్కుపడి నప్పుడు ధై ర్యమాగునా! పిమ్మట వారిరువురు మృగములజూడ నా చెట్టు చిట్ట చివర కెక్కి చూచి యెందునుం గనంబడమి సంతసించుచు ముందు శరభసాళ్వము చెప్పిన కోటరము వెదకి కనుంగొని యందులో దమ రాహారముకై తెచ్చుకొనిన మిఠాయి యుండ నొకటి జారవిడిచిరి. రా యుండదొర్లి యాయెలుకయున్న చోటికి బోయినది. దానిందిని యా మూషికము దానిసవంబట్టి యా తొర్రపైకి వచ్చినది. అందు గాచియున్న యాకుమారు లాయెలుకం బట్టుకొని చెట్టు దిగి దానింద్రాళ్ళతోఁ బిగియగట్టి శ్రీరంగపురంబునంగల జనుల యాపద బాపుటకై క్రమంబున జాడుగనుంగొనుచు రెండు దినముల కాపురము జేరిరి.

అందొక శ్రోత్రియబ్రాహ్మణుని యింట బసచేసి రాత్రి భోజనము చేసిన వెనుక యావిప్రునితో నయ్యా ! యీయూరు వింతలేమని అడిగిరి. అప్పుడాతండు కుమారులారా ! యీ పురంబున మఱియేమియు విశేషములులేవు. నిత్యము రాత్రుల శరభసాళ్వమను మృగమువచ్చి కనంబడిన జీవమును భక్షించుచున్నది. దాని కీరాజు ఎందరినో మహాశూరులఁ గాపుంచెను. కాని యేమియు లాభము లేకపోయినది.

అప్పుడీరాజు జనక్షయమునకు వెరచి యా మృగమును జంపినవానికిఁ దన కూఁతు బద్మావతియను దాని నిత్తునని ప్రకటించెను. ఆ వార్తవిని యాచిన్నదాని సౌందర్యమునకు వలచి పెక్కండ్రు రాజకుమారులు వచ్చి రాత్రి వీథిలోఁ బండుకొని శరభసాళ్వముచేతఁ భక్షింపబడిరి. ఇప్పుడెవ్వరును దానింజంపెదనని వచ్చుటలేదు.