పుట:కాశీమజిలీకథలు -01.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

దాని మూలముగా మిగుల నందగత్తెయగు పద్మావతి జవ్వనముగూడ వృధాచెడిపోవుచున్నది. రాత్రుల వీథిలోనికి బోవక పెక్కు చిక్కులు పడుచున్న మేము జన్మభూమి యైన యీయూరు విడువలేకుంటిమి. ఈయూరి విశేషము మఱియేమియులేదు. మీరు వీథిలోనికిఁబోకుడు. లోననే పండుకొనుఁడని చెప్పిన విని యాకుమారులు మోమునఁజిరునవ్వు మెఱయ నాగృహస్థునితో నిట్లనిరి. అయ్యా! మీరుభయపడకుఁడు మేమా మృగమును జంపుదుము. అది రాత్రి యెంత ప్రొద్దుపోయిన తరువాతవచ్చును? ఏ వీథికి ముందు వచ్చును? ఎందెందు సంచరించునో చెప్పుడని యడిగిన నతం డమ్మయ్యో! ఆ మృగవృత్తాంతము మీరెరుంగరు. మీకంటె బలాధికులు దానిచేత భక్షింపబడిరి. మీ ప్రాయమును రూపమును మనోహరములై యున్నవి. ఇట్టిపిచ్చి యూహలు విడిచి యింటిలో బండుగొనుడు. మీ తల్లిదండ్రులను భార్యలను బిడ్డలను నూరక దుఃఖసముద్రమున మునుఁగజేయఁ కుండని పలికిన వారు నవ్వుచు అయ్యా! మేమూరక యామృగముచేతఁ జచ్చుటకంత వెర్రివారమనుకొంటిరా. పద్మావతియందు మా కాసలేదు. ఈయూరి జనులు యాపద దప్పించుటయే మాయభిప్రాయమని చెప్పి యా బ్రాహ్మణుండడ్డముపడి యెన్నివిధములఁ జెప్పినను లక్ష్యముసేయక యారాత్రి వీథు లందు గస్తుదిరుగ జొచ్చిరి.

అంతట నాశరభసాళ్వము కల్పాంతజీమూతగర్జాసదృశముగా నార్చుచు బేర్చిన క్రోధంబున నాయూరు మీదబడి కనంబడిన దానినెల్ల భక్షించుచు నొక వీథిలోఁ గరవాలస్థులై ధైర్యముగా గ్రుమ్మరుచున్న యా వీరులం జూచి నోరుదెరచికొని మీదకు వచ్చెను.

అప్పుడు కామపాలుఁడు కుడిచేతిలోనున్న యెలుక గొంతుపు గట్టిగా నొక్కి చంపివేసెను. అప్పుడా సాళ్వము కంఠము వెంబడి యూపిరిరాక నేలంబడి తన్నుకొనిచచ్చినది.

పిమ్మట గారవాలమున దాని మెడ నరికి పారవైచి యా కుమారులిరువురు బసయున్న విప్రునింటికి వచ్చి యాయనతో అయ్యా ! మేము శరభసాళ్వమును జంపితిమి. చూచితిరా యని చెప్పిరి. అమాటలకతండు వెరగందుచుఁ గొంతసేపు నమ్మ లేదు. చచ్చి పడియున్నదా నింజూచినంత మితములేని యానందముతో వారిం గౌగలించుకొని కుమారులారా ? మీ ప్రాయమును జూడ మిగుల చిన్నదిగా నున్నది. మీ ప్రజ్ఞ మిగుల పెద్దది మా యూరికి గొప్ప యుపకారము చేసితిరని వారిఁ బెద్దయుంబ్రొద్దు స్తుతించేసి యప్పుడే రాజుగారి కోటలోనికిఁబోయి యాఁ వర్తమానము తెలియఁ జేసెను.

శ్రీరంగరాజు ఆ వృత్తాంతమువినినంత ననంత భూమండలాధిపత్యము సంప్రాపించిన సంతసించు నిరుపేదయుంబోలె జెలంగుచు నతిరయంబున లేచి ఆ మహాత్ములెచ్చట నున్నారో చెప్పుమని అతనినడిగెను.