పుట:కాశీమజిలీకథలు -01.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

చెప్పినవి. ఇందులోఁ గొంచమైన నసత్యములేదని దేవరవారితో మనవిచేసికొనుచున్నామని పలికి నక్క లూరకుండెను.

అప్పుడు శరభసాళ్వము ముట్టి నేలరాయుచు నే మేమి? భేరుండమును జంపిరా! అయ్యయ్యో అంత బలవంతమైన పక్షియుం జంపఁబడినదియా? అన్నన్నా! మనుష్యులు అసాధ్యులు గదా! అటువంటి సచివుఁడు నాకు దొరకునా! ఔను అది మధ్యార్జునమునకును నేను శ్రీరంగపురంబునకు రాత్రులఁ బోయి జీవహింస జేయుచుంటిమి. ఇది మేమిరువురము ఏర్పరచుకొనిన పద్ధతియే దాని జంపునంత బలము గలవాఁడు లేడనుకొంటింజుఁడీ ? అని పెక్కు గతుల దాని గుఱించి చింతింపఁదొడంగినది. అప్పుడు మృగములన్నియు గన్నులనీరు విడువదొడంగినవి. ఈరీతిఁ గొంతతడవు భేరుండపక్షిని గుఱించి చింతించి యేదియో యాలోచించుచున్న శరభసాళ్వమునకు జంబుకంబు లిట్లనియె.

దేవా ! మీరిప్పుడు చెప్పిన మాటలలో మాకొక భయము గలుగుచున్నది. మన మందరము సంవత్సరమున కొకసారి గదా యీ చెట్టుక్రింద జేరుదుము. అప్పటికిఁగాని మరల మనక్షేమసమాచారములు తెలియవు. నిరుడీ సభకు వచ్చి భేరుండము యీ యేఁట రాకమడిసినది. ఈయేఁడు వచ్చిన మృగములలో మీఁదటి కెన్ని పరలోకమున కేగునో తెలియదు. సామాన్య మృగముల పాటి సేయ నేటికి! దేవరవారుగూడ రాత్రులయందు భేరండమువలె శ్రీరంగపురమున కరుగుచు జీవకోటిని మడియించుచుంటినని సెలవిచ్చిరి. ఈహింస మనుష్యకోటికెల్ల నసహ్యమైనదేకదా! మొన్న భేరుండమును జంపిన శూరులు దేవరవారికిఁగూడ నేది యేనికీడు సంభవింపజేయుదురేమో యని వెరచుచుంటిమి దేవరకెద్దియేని ముప్పు వచ్చినచో మాబ్రతు కేమికావలయును. ఏలికలేక యెవ్వరికైన నిలువవచ్చునా? యిప్పుడిచ్చట నున్న జంతు లన్యోన్య విరోధములు గలిగియున్నను మీ శాసనంబునం జేసి యేమియు నోరు మెదపక శాంతములై యున్నవి. మృగజాతిలోఁ గట్టుండినచో మనుష్యులనఁగా నెంత ? అదిలేమింజేసియేగదా వారు గొన్నిటిచే భృత్యులవలె పనులు చేయించుకొనుచు లొంగనివాని మాయోపాయములచే జంపుచున్నారు. కానిమ్ము దాని మాటకేమి? ఇప్పుడు మీరు శ్రీరంగపురమున కరుగుట మాని వేయుఁడు. లేనిచో మాకెద్దియేని ధైర్యము జెప్పుఁడని పలికినవి మృగములన్నియు దలలూపి సంతసించినవి.

శరభసాళ్వము వాని మాటలువిని చిఱునవ్వునవ్వి యిస్సీ జంబుకములారా? నా బలపరాక్రమములు భేరుండము బలపరాక్రమముల వంటివిగావు. దానికిని నాకును జాల తారతమ్యము గలదు. మీరు నా ప్రాణతుల్యులు గావునఁ జెప్పెద వినుఁడు. భేరుండము ఆయువు భేరుండము కూడనేయున్నది. కావున దానింజంపిరి. నాది అట్లు లేదు. ఈ మఱ్ఱిచెట్టు తొఱ్ఱలో నొక యెలుక యున్నది. నాయాయువు దానిలో