పుట:కాశీమజిలీకథలు -01.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శరభసాళ్వము కథ

249

నాయడవినడుమ మనుష్యసంచారము లేదు. ఈ చెట్టు క్రింద ప్రదేశము జూడ రాయి గాని తృణముగాని లేక చక్కగా బాగుసేయఁబడియున్నది. దీనిక్రింద రాత్రు లెవ్వరేని వచ్చి ప్రచ్ఛన్నముగా నివసింతురా యేమి! యని యనేకప్రకారముల జింతించుచు నందు గిందుండరాదని నిశ్చయము చేసికొని కొంచెము వెల్తురుండగనే యాచెట్టెక్కి దట్టముగా నల్లుకొనియున్న యొకకొమ్మమీఁద గూర్చుండిరి.

ఇంతలో సాయంకాలమగుటయు మొదట నాచెట్టుక్రింద నద్భుతమైన కోతులును ఎలుగులును గొన్నివచ్చి యా నేలంతయు మిగుల జక్కగా బాగుచేసినవి. అంత జంబుకంబొకటి వచ్చి యాయున్న మృగములతో ముచ్చటింపఁ దొడంగెను. పదంబడి వ్యాఘ్రంబు వచ్చినది. దానివెనుక తోడేళ్ళ గుంపు, దానివెనుక వరాహములును, వానివెనుక మహిషములు వచ్చినవి. ఈరీతి జాతికొక్కటి చొప్పున నన్యోన్య విరోధముగల జంతువులు సైతము నిర్భయముగావచ్చి యా చెట్టుక్రింద నుచిత స్థలముల గూర్చుండి వచ్చిన వానిని, గుశలప్రశ్నలు చేయుచు రాఁబోవు వాని కెదురేగు చుండును.

ఆ రాత్రి జాము ప్రొద్దుపోవు నప్పటికి మృగములతో నాచెట్టు క్రింది భూమి యంతయు నిండినది. నడుమ రెండు మృగములకు మాత్రము చోటుంచినవి. అంత నద్భుతమైన యాకారముతో శరభసాళ్వమను మృగము వచ్చినది. అప్పుడచ్చటనున్న మృగములన్నియు లేచి దానికి దండములు పెట్టినట్లు ముట్టిగాళ్ళు వేయఁదొడంగినవి. అది వానినన్నిటిని నాదరించుచు నడుమ దిగవిడిచిన ప్రదేశమున నామృగములన్నిటికి నభిముఖముగా గూర్చుండెను.

అంతఁ గొంతసేపు పరిశీలించి శరభసాళ్వము తక్కినమృగములనెల్ల స్వాగత మడిగి యిట్లనియె.

మృగములారా అన్ని మృగములు వచ్చినవి గదా నామంత్రియైన భేరుండ మను పక్షి యేమిటికి రాకపోయెను. అదివచ్చు కాలము దాటిపోయినది. దాని కెద్దియో చిక్కు తటస్థించినట్లు తోచుచున్నది. లేనిచో నది యన్నిటికంటెను ముందేవచ్చును. దానివార్త మీలో నొకదానికేని దెలియునా ! అని యడిగెను. అప్పుడు మృగములన్నియుఁ దెల్లబోయి చూడఁదొడంగినవి. అప్పుడు నక్కలిట్లనియె.

దేవా ! మీ మంత్రియైన భేరుండము రాత్రులయందు మధ్యార్జునమను పురంబున కరిగి కనంబడిన జీవకోటిని భక్షింపఁదొడంగినది. ఈరీతి నెనిమిది మాసములు జరిగినదిగాని మాసము క్రిందట నాయూరిరువురు రాజపుత్రులు వచ్చి వీథిలోఁబరుండిరి అప్పుడది వారిని సామాన్యు లనుకొని మహాభీకరముతోఁ జంపఁబోయినది. అందులో నొకఁడు శూరకత్తిచే దానింజంపెను. ఈవార్త మాకు చుట్టములైన జంబుకములు