పుట:కాశీమజిలీకథలు -01.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

జంపిన వారికిఁ దనకూఁతు నిత్తునని మారాజు ప్రతిజ్ఞ చేసియున్నాఁడు. మీరు దానిం జంపి యిటు వచ్చిన వెనుక యొకచాకలి యాపక్షిని నేనే చంపితినని చెప్పి యా రాజపుత్రికనుఁ దనకు బెండ్లి చేయుమని యడుగుచున్నవాఁడు. దాని కతండేమియుఁ జెప్పలేక జింతించుచుండ దైవయోగమునఁ బెద్దమ్మ మూలముగా మీరు చంపినట్లు తెలిసినది. కావున మిమ్ము వెదకికొనుచు వచ్చి యిచ్చట మిమ్ములను బొడగంటిమి. మా రాజపుత్రిక మంచి యదృష్టవంతురాలు. ఆమె యందంబు దేవతాస్త్రీలకైనను లేదని చెప్పగలము. గుణముల కరుంధతియే సాటి. ఆ రాజపుత్రికను మీలో నెవ్వరు పక్షినిం జంపిరొ వారి కిత్తురు వడిగాఁ బోదము రండనిన సంతసించి యా కుమారు లిరువురును నా దూతల వెంట మధ్యార్జునమున కరిగిరి.

ఆ సింహకేతుఁడు వారిరాక విని మిగుల సంతసించుచు నెదురేగి యర్ఘ్యపాద్యాదివిధులతోఁ తోడ్తెచ్చి స్వాగతంబడిగి యద్భుతమైన వారి యాకారగౌరవమునకు వెరగందుచు సవినయముగా నయ్యా ! మీ యిరువురిలోఁ బక్షి నెవ్వరు జంపిరని యడిగెను.

అప్పుడు కామకాలుఁడు తన మంత్రి బుద్ధిసాగరుఁడే యా పక్షిం జంపెనని యా వృత్తాంతమంతయు జెప్పెను. అప్పుడు సింహకేతుఁడు చాకలివాని రప్పించి వారి యెదుటం బెట్టి యడిగిన గడగడ వడంకుచున్న వాని నురితీయుఁడని యాజ్ఞ చేసెను. కామపాలుఁడును బుద్ధిసాగరుండును వాఁడు చేసిన కృత్యమునకు నవ్వుచు దయాహృదయులు గాన వాని నా దండనము నుండి తప్పించి పంపివేసిరి.

పిమ్మట సింహకేతుఁడు బుద్ధిసాగరుని యాకారము సోయగము తనకూఁతురు సుగుణావతి కనుకూలముగా నున్నదని సంతసించుచు శుభముహూర్తమున మిగుల వైభవముతో బుద్ధిసాగరునికిఁ దనకూతురి నిచ్చి వివాహము చేసెను. బుద్ధిసాగరుం డాతరుణితో గొన్నిదినంబులందు గామోపభోగంబు లనుభవించెను. కామపాలుఁడును మిత్రునితో గూడ నందేయుండెను. ఇట్లుండి బుద్ధిసాగరుండును కామపాలుండును దేశాటనంమం దింకను దృప్తి వహింపక సుగుణావతితోఁ జెప్పి యెట్టకేల కామె నొడంబరచి యొకనాఁడు రాత్రి నాయూరు విడిచి యొకమార్గంబునం నడువసాగిరి. ఆ దారినట్లు పోవంబోవ నెందును బురంబు గనంబడినదికాదు. చీఁకటిపడువరకు నడిచిరి గాని యందుఁబయికి దోవ దారి తెలియక యెందైన నివాసయోగ్యమైన ప్రదేశ ముండునేమోయని నలుదెసలఁ గలయజూడ దొడంగిరి.

శరభసాళ్వము కథ

అందొక దెస విశాలశాఖాచ్చాదితంబై న మఱ్ఱివృక్ష మొకటి జూడనయ్యెను. దాని క్రింద భూమియంతయు జక్కగా బాగుచేయఁబడి యున్నది. వా రాశ్చర్యపడుచు