పుట:కాశీమజిలీకథలు -01.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

ఆ కుమారు లిరువురు నాకారమాత్రభిన్నులై మనఃప్రాణంబులు నొక్క,టియే యనునంత మైత్రిగలిగి వర్తించుచుండిరి.

విద్యలన్నియుఁ బరిపూర్తియైనంత నొకనాఁడు వారిరువురు నొండొరు లాలోచించుకొని యెవ్వరికినిఁ దెలియకుండునట్లు అడవిమార్గంబునంబడి దేశాటనసేయు తలంపుతో నరిగిరి. దేశాటనంబు పండితధర్మమేకదా ! మంత్రియింటనుండిరని సుశీలయు, సుశీల యింటనుండిరని మంత్రియుఁ దలచుటచేఁ గొన్నిదినముల వఱకు వారి ప్రయాణవార్త యిరువురకునుఁ దెలిసినదికాదు.

ఒకనాఁడు మంత్రి సుశీలయింటికివచ్చి కుమారు లెచ్చట నున్నారని యడిగిన నప్పఁడతియుఁ దడఁబడుచు నయ్యో! కొమారు లచ్చట లేరా? యని యడిగెను. అప్పు డతండు గుండె ఝల్లుమన నక్కటా అచ్చటనుండివచ్చి పెక్కుదినములై నదే. యిచట నున్నారనుకొంటిని. వారు మనలను మోసముచేసి యెచ్చటికోపోయిరి. అయ్యయ్యో! విదేశములలో వీండ్రెట్లు మెలంగఁగలరు ? అతిసుకుమారవంతులే ! అన్నన్నా! జాడైనఁదెలిసినదికాదు. ఏమి చేయుదుము అని యనేక ప్రకారములఁ జింతింపఁ దొడంగెను.

ఆ మాటలు వినుటతోడనే యాచేడియ కత్తిచే నరకంబడిన కదళియుంబోలె నేలంబడి మూర్చిల్లి యెట్టకేలకుఁ దెప్పిరిల్లి పెక్కుతెరంగులఁ జింతింప దొడంగినది.

అప్పుడు మంత్రి దైర్యము తెచ్చుకొని యామెతో నమ్మా! నీవు చింతింపకుము. వారు పండితులై దేశాటనము సేయఁచలంచిరి. చక్రవర్తికన్నఁ బాండిత్యము గలవారికి విదేశములో గౌరవముగా నుండును. వారును శీఘ్రకాలములో రాగలరు. నీవు ధైర్యముగా నుండుమని యామె నోదార్చి తనయింటికిఁ బోయి వారిజాడ తెలిసికొని వచ్చుటకు రహస్యముగాఁ బెక్కండ్ర దూతలంబంపెను.

సుశీలయుఁ బుత్రవియోగశోకంబున గుందుచుండ నొక్కనాఁడు విష్ణుచిత్తుఁ డత్తలోదరుని స్మరించుకొని స్మరసంతాపము జెంది యొక్కండే గుఱ్ఱమెక్కి యయ్యడవిలోనున్న సుశీలమేడకువచ్చి పరిచారకులవలనఁ దనరాక నామెకుఁ దెలియఁ జేసెను. అప్పుడాసుశీల మొగమున విన్నఁదనము దోపనీయక యతని రాకయుఁ దనకొకరీతి ప్రీతిగలుఁగఁజేయ నెదురేగి యతని పాదంబులు గడిగి తడియొత్తి చిత్తము గరుగ మెత్తనిమాటల స్వాగతమడుగుచు లోనికి దీసికొని యొకతల్పమునఁ గూర్చుండ బెట్టెను.

రాజు ఆమించుఁబోణిని మన్నించుచుఁ గుశలప్రశ్నఁ జేసెను. సుశీలయు నతనిచిత్తము జాలిబొడమునట్లు దేవా! దేవరవారికి నేటికి నాకుశలప్రశ్న గావలసి వచ్చినది. పోనిండు ఇదియు నాయదృష్టమే పదియారేఁడులైనది. మీరిచ్చటనుండి యరిగి యొక యుత్తరమైన బంపకపోతిరికదా? ఇంతకు నాదినముల మహిమ