పుట:కాశీమజిలీకథలు -01.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మీకు తియ్యని దాహము కావలయునా? పుల్లని దాహము కావలయునా? యని యడిగెను. ఆమాటకతండు సంతసించుచు తియ్యనిదాహమే యిమ్మనిన నమ్మగువయు దియ్యనిదియ్యనా! యని పలుకుచు శర్కరామిళితములైన దుగ్ధంబులు దాహమిచ్చి యింతకన్న రుచికి నాయొద్దనున్నది యధరమేకాని యధికములేదు చవిచూడుఁడని పలికెను.

అప్పుడాచతురుండా ప్రౌఢవచనంబులకు వెరగందుచు నోహో యీబోఁటి మాటలు మిగుల పాటవముగానున్నవి. అధరమనగా దక్కువయనియు నధరోష్టమనియుఁగూడ నర్ధముగదా! అధరోష్టము చవిచూడుమనికూడ సూచించుచున్నది. కానిమ్ము ఎట్లయినను మంచిదియె. యిచ్చట అన్యులెవ్వరును లేరుగదా! నట్టి మాటలతో గాలక్షేపము సేయనేల! తగినట్లే చెప్పెదనని తలంచుచు నారీమణీ! నాకా యధరమే కావలయును. మరొండు వలదు. అని పలుకుచు తటుక్కున నక్కుటిలాలక యధరంబానబోయెను. అమ్మించుఁబోఁడియు నించుక విదళించుకొనుచు నోహో! ఇది యేమి సాహసము. దాహమునకై వచ్చి వెలిపనులు చేయఁబూనితివేటికి! నేను వారాంగన ననుకొంటిరా! చాలుచాలు పోపొండు అనిపలుకుచు దదీయహస్తవిన్యాసంబులు ద్రోసివేయక యనుకూలసూచకముగా మెలంగిన నతండది యెఱింగి యాబోఁటి మాటలు పాటిసేయక, అతివా! మొదట నధరము చవిచూడుమని చెప్పి! పిమ్మటఁ ద్రోసివేయఁ దప్పునే! అంత యెఱుంగని వాఁడనుకొంటివా! శ్లేషలు నాకును వచ్చును. అని పలుకుచు జిట్టకంబులు గావించెను.

అప్పుడా సుశీల యతనిజేఁయి తనచేఁతం బట్టుకొని చాలుఁజాలు? మగవారి వలపులును జలముల వ్రాతయు సమానములైనవి. మొదటనిట్లేచేసి యవసరముతీరిన వెనుక మరలఁ బలుకరింపరు. ఎల్లప్పుడు నిట్లున్న సమ్మతింపవచ్చును. "వ్రతము చెడినను సుఖముదక్కవలయు" ననుసామెత వినియుందురుగదా? అనిన నతండౌ నౌను నన్నట్టివానిఁగా దలఁపకుము. నీయిష్టము వచ్చినట్లు మెలంగెదనని చేతిలోఁ జేఁయివై చెను. పిమ్మట నాకొమ్మ సమ్మతించి నట్లభినయించుచు నతని నంతకుమున్నే యలంకరించయున్న మేడఁమీదకుఁ దీసికొనిపోయి హంసతూలికాతల్పమునఁ జేర్చినది.

మరియు నందు నయ్యిందువదన కొంతసేపు కంఠనాదంబు దంత్రీనాదంబుతో నైక్యమునొంద వీణధరించి సంగీతంబు పాడుచు నతనిమతిఁ గరగఁజేసినది. ఆ