పుట:కాశీమజిలీకథలు -01.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

చక్కనిదని చెప్పుచు దానిగుఱించి పెక్కుగతుల నుతియించెను. విష్ణుచిత్తుఁ డతని మాటలచే మోసపడి యప్పఁడతిని దనకుఁ బెండ్లిచేయుమని వేడుకొనియెను. అందుల కతండు సమ్మతించి యాదేశమునకఱిగి విక్రమసేనునికడ విష్ణుచిత్తుని యౌన్నత్య మంతయుఁ బొగడి యతని కూఁతు నతని కిచ్చున ట్లొడంబరపించెను.

పిమ్మట నతఁడు విష్ణుచిత్తునొద్దకువచ్చి అయ్యా! దేవయానకు విక్రమసేనుఁడు మీకియ్యనిశ్చయించెను. మీ కిదివరకుఁ బెండ్లియే కాలేదని చెప్పితిని. లేనిచో మీకతండు కూఁతునియ్యఁడు. కావున నిప్పుడున్న భార్య నడవిలో విడిపింప నియోగింపుఁ డని బోధించిన విని యారాజు సమ్మతించి యట్లుచేయ నప్పుడే మంత్రి కాజ్ఞ యిచ్చెను.

దీర్ఘ దర్శి సుశీల నడవిలోనుంచుట తనకిష్టములేకున్నను రాజశాసనమును నతిక్రమింప నశక్యమైనదగుట నందొక విశాలమగు మేడ కట్టించి పెక్కండ్ర పరిచారకులతో సుశీల నా సౌధంబున బ్రవేశపెట్టి క్షేమ మరయుచుండెను. అందులకు సుశీల మిగుల జింతించుచుఁ జచ్చుటకుఁ యత్నించుటయు మంత్రి యోదార్చి యా యుద్యమము మరలించెను.

అంత శుభముహూర్తమున విష్ణుచిత్తుఁడు దేవయానం బెండ్లియాడి యాచేడియ రూపము తనకంత యపురూపముగాఁ దోచమి యథోచితానురాగంబుతో నావిడం గూడి యుండెను.

ఇట్లుండునంత నొకనాఁడు విష్ణుచిత్తుఁడు తనకు వేటయం దభిలాష జనించుటయుఁ దనకోరిక మంత్రితోఁ చెప్పెను. మంత్రియు సమ్మతించి యప్పుడే తగిన సంభారములన్నియు సిద్ధపరచి సుశీలయున్న యడవిలోఁ జాలమృగములున్నవని రాజుతోచెప్పి యాయడవికిఁ దీసికొనిపోయెను. రాజు పెక్కండ్రు మృగములతో నయ్యడివి కరిగి యదేష్టముగా నందు మృగముల వేటాడుచుండ దైవయత్నమున జాముప్రొద్దుండ నద్భుతమైన గాలివాన పట్టినది. అప్పుడు సేనలన్నియుఁ బికాపిక లై పారిపోయినవి. రాజును మంత్రియు నొక చెట్టుక్రింద నిలువంబడిరి. యాచెట్టుకొమ్మ లన్నియు విరుగుచుండుటం బట్టి యందునిలువవెరచి యావానలో బట్టబయలనే తిరుగఁ జొచ్చిరి. అప్పుడు వారికిఁ బ్రాణములం దాశవదలినది. ఇంతలో కొంచెము గాలివాన యణఁగినందున తడిగుడ్డల బిండుకొని గజగజవణఁకుచు నయ్యడవిలో నిలువ యే గుడిసెయేనిం గలదేమోయని యిటునటు దిరుగజొచ్చిరి.