పుట:కాశీమజిలీకథలు -01.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధిసాగర కామపాలుర కథ

235

వలన నామెకొక మేడ నివసింపఁ జూపించెను. ఆసాధ్వియు నందుఁబ్రవేశించి తన మగనింజూడ నత్యాతురము గలదియై ఆదిత్యునిరాక కెదురుచూచు పద్మినియుంబోలె వేచియుండెను. అట్లుండ నయ్యండజయానకు దినవార పక్షమాసఋత్వనయనంబులు గడచినవి. కాని మనోహరుని దర్శనము లభించినదికాదు. అందులకు జింతించి గడియ యుగముగా గడుపుచున్న యాచిన్నది చిన్నబోయి యొక్కనాఁడు దీర్ఘదర్శికి వార్తనంపి యతనితో నిట్లనియె.

ఆర్యా! నాకు వివాహమై సంవత్సరమైనది. ఇంతదనుక నామనోహరుని మొగమెట్టిదో నేనెరుంగను. ఆయనకు నాయం దెద్దియేని గోపముండఁబోలు. కారణ మేమియు నాకుఁ దెలియదు. దేహమాత్రభిన్ను లగు మీయిరువురిలో నొకరిరహస్య మొకరికిఁ దెలియక మానదు. నాకు నీయందు చనువు గలిగియున్నది. గావున నిట్లడుగు చుంటిని. యథార్ధమెద్దియేని గలిగియున్న వక్కాణింపుమని పలికిన నాకలికి పలుకుల కులికిపడి యాప్రధాని యామెతో నిట్లనియె.

తల్లీ ! నీవల్లభుఁడు నీయందనురక్తుఁడై యున్నవాడేయని యనుకొంటిని . ఇట్లుచేయుచున్న వార్త నాకేమియుం దెలియదు. పరమసాధ్వియగు నీయందేమి తప్పున్నది? యతని యభిప్రాయమెద్దియో గనుంగొని వక్కాణించెదనని యామెతోఁజెప్పి యొక్కనాఁడితఁ డెద్దియో ప్రస్తావముమీఁద నామాట రాజుతో ముచ్చటించెను. అప్పు డతండు అజ్యాహుతివలనఁ బ్రజ్వరిల్లు నగ్నియుంబోలె మండిపడి మంత్రీ! యిట్టి యనవసరప్రశ్నము లెన్నఁడును నాయొద్దఁ దీసికొని రాకుమాయని మందలించి పలికెను.

అప్పుడా ప్రగడ భయపడి మరల నోరెత్తక మెత్తనిమాటలచే నతనిచిత్తమును ప్రసన్నముగఁ జేసికొని యంతటితో నాప్రస్తావము ముగించెను. తర్వాత మంత్రి సుశీలచెంత కరిగి సాధ్వీ! నీపతి నీయందేదియో యీర్ష్యబొందియున్నట్లు కనబడుచున్నది. నీప్రస్తావమే విననొల్లఁడాయెను. కారణము ముందర గనుంగొనియెద. నీవు చింతింపకుము. కాలక్రమంబున నతనిమతి మఱలించి నీయం దనురాగము పుట్టు నట్లు చేసెదనని యవ్వనిత నోదార్చి సమయము గనిపెట్టుచుండెను.

సుశీలకుఁ జదువుచెప్పిన గురువు అంతటితోఁ దృప్తిబొందక మరల నొకనాఁడు విష్ణుచిత్తునొద్దకు వచ్చి యతనితో నిష్టాగోష్ఠిం గాలక్షేపముఁ జేయుచుఁ బ్రశంసగాఁ బాంచాలదేశంబున విక్రమసేనుండను రాజుకూతుఁరు దేవయానయనునది మిక్కిలి