పుట:కాశీమజిలీకథలు -01.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

వేషముతో విష్ణుచిత్తుని దర్శనముజేసెను. విష్ణుచిత్తుండు ఆపండితుని మిగుల గౌరవించి కులదేశనామంబులు తెలిసికొని తన యత్తవారియూరే యగుటచే మఱియు సంతసించుచు నతనితో నిట్లనియె.

అయ్యా! మీరాజుకూతురు సుశీల వృత్తాంతము మీకేమైన దెలియునా! ఆచిన్నదాని రూపంబును గుణంబును శీలంబును నెట్టివో చెప్పుఁడని యడిగిన నాబ్రాహ్మణుఁడు సంతసించుచు నిట్లనియె.

అయ్యా! నేనారాజుగారి సంస్థానములో ముఖ్యపండితుండను. ఇదియునుం గాక యాసుశీలకుఁ జదువుచెప్పినవాడను నేనే. ఆమె శీలంబును గుణంబును నాకుఁ దెలిసినట్లు తలిదండ్రులకైనఁ దెలియవు. మీ రడుగుచున్నప్పుడు నిజము చెప్పవలయును. దానిశీలమున కేమిగాని రూపము పైకిజూడ వేడుకగానే గనుపించును. దాని కప్పుడప్పుడు మూర్చరోగము గనంబడుచుండును. ఈ రహస్యము నాకుఁగాక మఱియొకరికిఁ దెలియదు. ఈ గుట్టంతయుఁ గప్పిపుచ్చి రంగులు బాగుగావైచి పటమువ్రాసి పంపిరి. మీరాపటమునుజూచితిరా! యేమి! ఆపటమునుజూచినవారికి నిజముగా నాచిన్నది యట్లే యున్నదని భ్రాంతికలుగక మానదు. మీవంటివారి కాచిన్నది తగదని యెరుగనట్లుగాఁ జెప్పెను.

ఆమాటలు విని యావిష్ణుదత్తుఁడు మనసు చివుక్కుమన, నేమి! దానికట్టి రోగము గలిగియున్నదా! శీలముసంగతిగూడ ననుమానముగానే చెప్పిరి. అయ్యయ్యో! యెరుగక మోసపోతినే! అన్నన్నా! పాండ్యదేశపురాజు నన్నెంత మోసముచేసెను. ఇన్నిదినములు బెండ్లి చేసికొనక చివరకు రోగభూయిష్టురాలిని బెండ్లియాడితినే కానిమ్ము. ఆరాజు నన్నిట్లుమోసము చేసినందుకు దగిన ప్రాయశ్చిత్తము చేసెదను. అతనికూతురు మొగమెన్నఁడును జూడను. అట్లుచూచితినేని మాతృద్రోహము చేసినంత పాపమునకుఁ బాత్రుఁడనయ్యెదనని దారుణముగా శపథము చేసెను. ఆప్రతిజ్ఞను విని యాపాఱుఁడు తన ప్రయత్నము కొనసాగినదికదా యని సంతసించుచు నతనివలన ననుజ్ఞ వడసి తన దేశమునకు బోయెను. తమ కేమియు లాభము లేకున్నను నసూయయే ప్రధానముగాఁగల యాబ్రాహ్మణుఁడు సుశీల కెట్టి యపకారము చేసెనో చూడుము. విలస్వధాన మెట్టిదియే కదా? పిమ్మట నాసుశీలయు గొప్పసారితో నత్తవారిల్లు చేరినది.

ఆమె వచ్చినవార్త విని యాభూభర్త గౌరవింపక దీర్ఘక్రోధుఁడై పరిచారిక