పుట:కాశీమజిలీకథలు -01.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధిసాగర కామపాలుర కథ

233

గ్రహముండినం జాలును అని పలికిన నక్కలికి యతండు గోపముతో నట్లనుచున్నాఁడని నిశ్చయించి అయ్యా! మీ కీధన మక్కరలేనిచో మఱియేమి కావలయును? నేనోపుదేని నిచ్చెదను సెలవియ్యుఁడని పలికిన నావైదికుఁడు వెఱ్ఱినవ్వునవ్వి యిట్లనియె.

తెఱవా! యూరక నోరుతెఱచి యడుగుటయేకాని తుద కియ్యనందువేమో! నిక్కముగా నిచ్చెదనని వాగ్దానము జేసినచో నడిగెదననుటయు నాముగ్ధ యామూర్ఖుని తలంపు తెలిసికొనలేక అయ్యో అయ్యవారూ! మీరు కోరుటయు నేనియ్యననుటయు గలుగునా? నేనంత లోభిదాననుగాను. మీకామిత మేదియో తెలియఁజేయుఁడు. నాకు మీకామిత మీడేర్చుటకంటె నెక్కుడుగలదా? అని పలికిన నతం డయ్యతివ కిట్లనియె.

కామినీ! నీవంటివా రాడితప్పరుగదా! వినుము. నీరూపము త్రిలోకజనమోహనకరము. నిన్ను జూచినప్పుడెల్ల నాయుల్లము రతివల్లభుఁడు విరిమాపుల నేపుమాపుచున్నవాఁడు. ఇంతదనుక నీవు సమారూఢయౌనపురూపు గావునఁ గోరకుంటి. ఇప్పుడు నామనంబు నీసంగమం బభిలషించుచున్నది. ఇదియె నాగోరిక. దీని దీర్చిదవేని గురుభక్తి గలదానవని నిన్ను మెచ్చుకొనెదనని పలికిన నులికిపడి యక్కలికి శివ శివా! యని చెపులు మూసికొని అయ్యో! నీవు నాకుఁ తండ్రివి కావా! ఇట్టి కోరిక నన్నుఁ గోరవచ్చునా? నీకు నన్నిట్లన నోరెట్లాడినది? వేరెద్దియోకోరెద వనుకొంటిని. ఇట్టి నీచపుబుద్ధిగలవాఁడ వని తెలిసికొననైతిని. చాలు చాలు వైదికుఁడా! నీ గుణము తెలిసినది. ఇష్టమైన నీసొమ్ము పుచ్చుకొనుము. లేనిచో బారవేసికొనమని యా పళ్ళెరము నేలపారవై చి గిరుక్కున మరలి మొగంబున చిన్నఁదనము దోప నంతఃపురమున కరిగినది.

పిమ్మట నాబ్రాహ్మణుఁడు తెల్లబోయి యేమియుఁ బలుకలేక ఔరా! నేను గురువునని కొంచమేనియు సంశయింపక యీవగలాడి యెట్లుతిరస్కరించిపోయినది? కానిమ్ము. నాబుద్దినైపుణ్యమంతయు విని యోగపరచి దీనికిని మగనికిని సంబంధము లేకుండఁ జేసెదనని యీసు వహించియుండెను. అంత శుభముహూర్తమున దీర్ఘదర్సిచేఁ దీసికొని రాఁబడిన విష్ణుచిత్తుని కత్తికిని సుశీలకును గొప్ప వైభవముతో బెండ్లిజేసిరి. తండ్రి వివాహపరిసమాపకదివసంబున సుశీలను మితిలేని సారెతో నత్తవారింటి కనిపెను.

ఈలోపలనే సుశీలకుఁ జదువుచెప్పినగురుపు కాంచీపురమున కరిగి పండిత