పుట:కాశీమజిలీకథలు -01.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధిసాగర కామపాలుర కథ

231

పదునొకండవ మజిలీ

బుద్ధిసాగర కామపాలుర కథ

పదునొకండవ మజిలీయం దడవిలో నొకచోట దలవెండ్రుకలు గలిగియున్న శిలావిగ్రహమునుజూచి యాగొల్లవాఁడు వింతపడిపోయి మణిసిద్ధుని తద్విగ్రహవృత్తాంతము చెప్పుమని యడిగిన నయ్యతిపతి మణివిశేషముచే దానితెరంగంతయు గ్రహించి వెరగందుచు నాకథ యిట్లని చెప్పఁదొడంగెను.

కాంచీపురంబున విష్ణుదత్తుఁడను రాజుగలఁడు. అతఁడు దీర్ఘ దర్శియను మంత్రితో న్యాయంబుగఁ బ్రజల బాలించుచు భూలోకములోఁ దనకుదగిన కన్యక లేదని పలుకుచు నెట్టిసుందరులం దీసికొని వచ్చినను యొప్పుకొనక పెద్దకాలము వివాహము లేకయే యుండెను.

ఇట్లుండునంత నొక్కనాఁడు దీర్ఘదర్శి రాజుతో నిట్లనియె. దేవా! దేవరవారిట్లు వివాహమాడకున్కి రాష్ట్రంబంతయు జింతించుచు యువరాజు నభిలషించుచున్నది. చక్కఁదనంబు లెక్కడికి! ఎట్లు సరిపెట్టుకొన్న నట్లే సరిపడును. నేను మీకు బుద్ధులుగలుపువాఁడనుకాను. మీరే నిదానించి యొకశుకవాణిం బెండ్లియాడి కుల ముద్ధరింపుఁడు. అని పలికిన విని యారాజు మంత్రి కిట్లనియె.

దీర్ఘ దర్శీ! నీవు బుద్ధిమంతుడవుకదా ! నీకు నే నెక్కుడుగాఁ జెప్పనక్కరలేదు. మనము లోకంబున స్త్రీలం జూచుచుంటిమి. చక్కనిదానియందు శీలముండదు. శీలమున్న బ్రీతియుండదు. ప్రీతియున్న చక్కదనముండదు. అన్ని లక్షణంబులుం కలిగి తనయందు ప్రేమగల కలకంఠి దొరుకుట దుర్ఘటము.

నాకు బెండ్లిజేయదలఁచితివేని నిప్పుడు నేనుచెప్పిన లక్షణము లన్నియుం గలిగిన చిన్నదానిని దెచ్చి పెండ్లిజేయుము. లేనిచో నిట్లే యుండెదనని పలికిన విని యామంత్రి వల్లెయని యప్పుడే యట్టికన్యకల నరయుటకై యారాజురూపము పటంబులవ్రాయించి దూతలకిచ్చి నాలుగుదేశంబుల కనిపెను.

పాండ్యదేశమహారాజు సుశీలయను తనకూతుఁరు రూపము పటంబుల వ్రాయించి దానికిఁ దగిన పురుషుని వెదకి, తీసికొని రండని దూతల కాజ్ఞాపించెను.తద్భృత్యులు రాజశాసనప్రకార మాపటంబులం గొని యనేకదేశముం దిరిగి వీరును