పుట:కాశీమజిలీకథలు -01.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నచ్చట చచ్చియున్న శవముల యవయవములన్నియు నరికి నరికి రాసులక్రింద బెట్టెను. మేనంతయు రక్తము బూసికొని యుద్ధభూమిలో రుద్రునివలె శవముల నడుమ దిరుగజొచ్చెను. అంత నుదయమున భూరిశ్రవుఁ వానిజయంబు బ్రజలవలన విని యత్యంతసంతోషముతో నచ్చటికరుదెంచి భైరవునివలె గ్రుమ్మరుచున్న సోమశర్మంగని కౌఁగలించుకొని యిట్లనియె. మహాత్మా! నీవు మనుష్యమాత్రుఁడవుకావు. ఒక మానవునికింత పనిచేయిశక్యమా ! నాయాపదల బాపుటకై వచ్చిన భగవంతుడని నమ్మెదను. నీవు చేసిన మేలున కెద్దియును ప్రతికృతిచేయలేను. ఇదిగో! నమస్కరించుచుంటినని పాదంబులంబడిన సోమశర్మ సగౌరవముగా నతని లేవనెత్తి యోహో రాజా! నీహస్తప్రాయుండనగు నన్నింతస్తుతి చేయవలయునా! ఇదియంతయు నీకటాక్షమే ఈరాజు బలమననెంత? మూడు లోకంబులు వచ్చినను గోడు చెడసేయఁగల నని దర్పముగాఁ బలికెను.

అంత నారాజు సోమశర్మను బల్లకీపై నెక్కించి మేళములతోఁ దాళములతో నూరేగింపుచు నింటికిఁ దీసికొనిపోయి విందుల చేయించి యెద్దియేని యభీష్టమున్న గోరుమని యడిగెను. అప్పుడు సోమశర్మ యేమియు గోరక మంత్రితోగూడ మిగిలి యున్న రెండులక్షల సైన్యమునుగూడ నుద్యోగములనుండి తప్పించి యాజీతములును దనకే యిప్పింపుమని వేడుకొనెను.

ఆరాజు సోమశర్మ కోరిన ప్రకారము అప్పుడే యాజ్ఞచేసి యంతటితోఁ దృప్తి బొందక యతినిరూపము లోహములో బోతపోయించి యీనడివీథిలో జిరకాలముండు నట్లు నినుపకంబముపై నమర్చెను.

గోపాలా! ఆకనుపించు విగ్రహము ఆ సోమశర్మయొక్క యాకారము అది శిల్పవైచిత్రమునుబట్టి నిజముగా బ్రాహ్మణుఁడు నిలువఁబడినట్లు గనంబడుచున్నది. కాని వేరుకాదు.

ఈ పట్టణ మాభూరిశ్రవునిదే. పెద్దకాలమైనది. కాన నాసంతతి వారందరు నశించిరి. గాని యీలోహస్తంభము మాత్రము రూపుచెడక యట్లేయున్నది. దానికేగాదా మన పెద్దలు తనపేరు భూమిలో స్థిరముగా నుండుటకై సప్తసంతానముల నిలుపుదురు. ఇదియే దీని వృత్తాంతము. ఇక లెమ్ము. వేళ యతిక్రమించినది. బసలోనికి బోయి వంటఁ జేసికొని భుజింతము అని చెప్పి వానితోఁగూడ సత్రములోనికిబోయి వంటజేసికొని భుజించి కొంతసేపు విశ్రమించి మరల బయనముచేసి క్రమంబున పదునొకండవ మజిలీ చేరిరి.