పుట:కాశీమజిలీకథలు -01.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంగల మంత్రి కథ

229

లక్షల సేనయున్నది. దీనికంతకును గారకుఁడైన సోమశర్మనే యుపాయమడుగుడు. నాకు దెలియదు. అతఁడు యుద్ధములో మృతిజెందినవెనుక నేను యుద్ధము చేయుదును. అని మొగమాటములేక యుత్తరమిచ్చిన మంత్రి నేమియు ననలేక భూరిశ్రవుఁడు సోమశర్మను బిలిచి యావృత్తాంతమంతయు నెఱింగించెను. వాని మొండిధైర్య మెట్టిదో చూడుము. అప్పుడుకూడ నించుకేని భయమందక దైవబలము తనకు బాగుగానున్నదను నమ్మకముతో రాజుతో నిట్లనియె.

దేవా! నావంటిబంటు మీకు గలిగియుండ మీరు చింతింపవలయునా? మీరు వినోదముగా నింటఁ గ్రీడింపుచుండుఁడు. నేనొక దినమున నా శత్రువులమదం బడగించి వచ్చెదననిన నద్బుతమంది సోమశర్మా! నీకు గావలసిన సహాయమును దీసికొని పొమ్మని చెప్పెను. ఆమాటలు విని యతం డయ్యా! నాకు దొంగలఁ జంపునప్పుడును, సింహమును బరిమార్చినప్పుడును, ఏవారు సహాయముచేసిరో యిప్పుడు మాత్రము సహాయము చేయరా! నాకు సహాయము చేయువాఁడు గూడనేయుండును. యీసైన్యముతో నిమిత్తము లేదనిచెప్పి యారాజున కుత్సాహము గలుగజేసెను.

అంత సోమశర్మ యారాత్రియే యా చక్రవ్యూహంబునకుఁ బ్రాంతమందొక గోయి త్రవ్వించి సింహచర్మము కత్తులు మాత్రము తీసికొని రహస్యముగా నాగోతిలో బ్రవేశించెను. అంత నర్ధరాత్రంబున చతురంగబలములు నిద్రాణములై మేనులు తెలియక సోలియున్న యవసరంబున నాసోమశర్మ గోతినుండి పైకివచ్చి పొడు పొడు, పొడు మని పెద్దకేకలు వైచుచు నాసింహము చర్మము నేనుఁగులమీదకు నెగరవైచెను. ఆచర్మము పచ్చి వదలలేదుగాన దానివాసన గొట్టినంత నేనుఁగులన్నియు చెదరి గొలుసులు త్రెంచుకొని సేనమీదఁబడి కలియ త్రొక్కినవి.

అప్పుడు చతురంగబలము వారును మేల్కని యేమియుఁ దెలియక శత్రుసేనవచ్చి తమమీదఁ బడిననుకొని వీరాలాపములు పలుకుచు కొట్టుమనియుఁ బొదువుమనియు, నరుకుమనియుఁ, బట్టుమనియు జీఁకటిలోఁ దెలియక యొకరినొకరు చంపుకొనఁ దొడఁగిరి. ఈరీతి నల్లకల్లోలమై యాసేనయంతయు బోరాడి యొకజాములోఁ బేరుమాసెను. ఆహా! సోమశర్మ దైవబల మెంత బలవంతమైనదో చూడుము. పిమ్మట సోమశర్మ యా మొండెములనడుమనుండి శిబిరమున కరిగి నిశ్చేష్టితుఁడై చూచుచున్న యాశత్రురాజుపై బడి కత్తిచే శిరము నరికెను. మరియు నతఁడు తెల్లవారువరకు