పుట:కాశీమజిలీకథలు -01.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మిమ్మని వేడుకొనెను. అతం డంతమాత్రమునకు సత్యలోపము గలుగునని తలంచి బుద్ధిమంతుఁడగు పూర్వపుమంత్రిని తగ్గించి వానిని బ్రధానిగా జేసికొనియెను.

ఆ వార్త శత్రురాజునకుఁ దెలిసినది. పెక్కుదినములనుండి యతనిఁ గెలువఁ దలంచియు మంత్రి బుద్ధిబలముచేతనే చేరలేకపోయిరి. అప్పుడదియే సమయముగదా యని యూహించి పెక్కండ్రు ఏకముగాఁ గూడివచ్చి యారాజుకోట ముట్టడించిరి.

అప్పుడారాజు మంగలమంత్రిని బిలచి శత్రురాజులు మనకోట ముట్టడించిరి. ఇప్పుడేమిచేయవలయునో చెప్పుమనిన వాడిట్లనియె.

అయ్యా! బాబు! నాతల్లికి నేనొక్కడినే యుంటిని. మీరును అట్టివారేకదా ! బ్రతికియుండిన బలుసుకూరైనం దినవచ్చును. ఈశత్రురాజుల నెవ్వడు గెలువం గలఁడు. నాయొద్ద మాతాత సంపాదించినవి రెండుపొదు లున్నవి. ఒకటి మీ కిచ్చెదను. రెండవది నేను దాల్చెదను. అట్టివేషములతోఁ బారిపోయినచో మనలను శత్రురాజులు చంపక విడిచిపెట్టెదరు, పిమ్మట నేయూరికైనను బోయి దినమున కిద్దరికి క్షౌరము చేసినచో పొట్టగడవకపోదు దీనికై యింత విచారింపవలయునా? యని యుపాయము చెప్పెను. ఆ మాటలు విని రాజు చీ! నిర్భాగ్యుడా! నీకు మంత్రిత్వ మిచ్చినందులకు నాకు మంచిబుద్ధి చెప్పితివి. నీ సాంగత్యము చాలు పొమ్మని వాని దిట్టుచు బూర్వపుమంత్రి యాగ్రామమందే యున్నవారు గావున నతనియొద్దకు బోయి తన కాపద దాటింపుమని పాదంబులం బడి ప్రార్ధించెను.

కృతజ్ఞుడైన యామంత్రి యాపత్కాలమందు వచ్చిన రాజును దిరస్కరింపక భయపడవద్దని పలుకుచు నంతకు పూర్వమే తాను రాజునకు వ్యతిరేకుఁడనిని కొని తెలిసికొని కోట బట్టుకొనుటకై సహాయము చేయుమని కోరిన శత్రురాజుల కిట్లు జాబు వ్రాసెను.

ఇప్పుడు మీయిష్టప్రకారం గోటబట్టి యిచ్చెదను. కోట స్వాధీనమైనపిమ్మట మీలో రాజెవ్వఁడు కాబోవునో తెలియఁజేయుడని వ్రాసెను. అట్టి చీటిం జదువుకొని యారాజులందరును తమకే కావలయునని గోరి కలహము పెంచికొని దారుణమైన యుద్ధము చేసి తుద కొకరిచేత నొకరు హతులైరి.

అలాగుననే నీవును వైదికునికి భోజనముగాని బట్టగాని అగ్రహారములుగాని యివ్వక సేనను దగ్గించి సేనాదిపత్య మిచ్చితివి. నేను జెప్పినను వినకకపోతిని. ఇప్పు డనుభవింపుఁడు. రెండులక్షల ఫౌజుతో మనమేమి యుద్ధము జేయఁగలము. వారికి పది