పుట:కాశీమజిలీకథలు -01.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

పోపొండు ఈ సంగతి మీ రాజుగారితోఁ జెప్పియిచ్చటికిఁ దీసికొనిరండు అని గద్దిరించి పలికిన దూతలు భీతిజెంది యతని తిరస్కరింపనేరక యతివేగముగాఁ బోయి యాచర్య యంతయు భూరిశ్రువున కెఱింగించిరి.

అతండు మిగుల సంతసించుచు బెక్కుసైన్యముతో నప్పుడే యయ్యరణ్యములోని కరిగి యాధనరాశి చుట్టును పహరా యిచ్చుచున్న సోమశర్మను చూచి నమస్కరించి యిట్లనియె. అయ్యా, తమరెవరు ! యిచ్చటి కెట్లు వచ్చితిరి? యిరువదినలుగుర దొంగలనెట్లు జంపితిరి? నాయందు మీకీ యనుగ్రహ మెట్లుగలిగినది? చెప్పుడని యడిగిన నతండు ధైర్యముతో నిట్లనియె.

దేవా! నా మహిమ నేనే చెప్పుకొనుటనేటికి? క్రియచేఁ దెలియదా? అదిగో నరకబడిన దొంగల యవయవముల జూడుఁడు. ఇదిగో వారి కత్తులు. యిరువదు నలుగురను వధించితిని. మీకు వర్తమానము చేయుదమని యూహించినంతలో మీ భటు లిచ్చటికే వచ్చిరి. ఇంత పనికిమాలిన పరిచారకులఁ గూర్చుకొంటి వేటికి ? క్షణము దాటినచో నంత ద్రవ్యము వృథాగాఁ బోవుఁనుగదా? యిప్పు డొకనల్లపూస యేని పోయినదేమో చూచుకొమ్మని పలికిన నాభూరిశ్రవుఁడు సంతోషము జెంది యా బ్రాహ్మణునిఁ గౌఁగలించుకొని మిత్రుఁడా? నీ కతంబున నా పరువు నిలిచినది. నీవు చేసిన మేలెన్నటికిని మరువను, నీవు నాయొద్దనుండుము. నీ కెద్దియేని వరమిచ్చెదఁ గోరికొమ్మని పలికిన నా సోమశర్మయు రాజా! నీయొద్దనున్న సేన ఆరులక్షలని తెలిసినది. ఇంతమంది యుండినను నీ కోట దోపుడు మానినదికాదు. వాండ్రకు వృధాగా జీతములియ్యనేటికి? వారిలో రెండులక్షల జనమును దగ్గించి వారి జీతములు నా కిమ్ము ఇదే నా కోరిక యని చెప్పిన నతం డప్పుడే యట్టి సైన్యమును తగ్గించి యావేతనము సోమశర్మకు నిచ్చునట్లాజ్ఞ చేసెను.

పిమ్మట నారాజు నాధనమంతయు బండ్లమీద నెక్కించికొని సోమశర్మతోఁ గోటలోని కరిగెను. సోమశర్మయుఁ బురికరిగిన వెనుక రాజుగారిచే నియ్యబడిన సౌధంబున బసజేసి యచ్చటికి భార్యను రప్పించి తాను మొదట చెప్పిన ప్రకారము ఆమె మేనంతయు బంగారుమయము గావించెను.

రాజుగారి దివాణములోనున్న యుద్యోగస్తుల కందరికి సోమశర్మయం దసూయ గలిగియున్నను నేమియుఁ జేయలేకపోయిరి. రాజుచేఁ దగ్గించబడిన రెండులక్షల సైన్యము అతనికి శత్రువుగానున్న వేరొక్కరాజు నాశ్రయించిరి. ఇట్లుండ నంత నొక్కనాఁడు ఆ గ్రామమునకు రాత్రులయం దొక సింహము వచ్చుచు మనుష్యులను