పుట:కాశీమజిలీకథలు -01.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమశర్మ కథ

223

విషము తలకెక్కి యాదొంగలందరు నిద్రలోనే ప్రాణములు విడిచిరి. వారి చావు సోమశర్మ కొంత సేపటికిఁ దెలిసికొని మితిలేని సంతోషముతో మనంబున నిట్లు తలపోసెను.

ఆహా! వీరందరు నేను బెట్టిన యఱిసెల మూలముగానే మృతిబొందిరి. ఈ యఱిసెలలో రాత్రి నాభార్య ప్రమాదమున నాభికూడ గలిపినది కాఁబోలు. దైవము నాకీతీరున ద్రవ్యము గూర్చెను. లోకంబంతయు దైవము చేతిలోనున్నది. పురుషకారం బేమియుం బనికిరాదు. ఒక్కప్పుడెంత ప్రయత్నము చేసినను గాసైన లభింపదు వేరొకప్పు డూరకయే పెక్కు ద్రవ్యలాభము కలుగును. నాకు దై వాయత్తముగా నిప్పుడు గొప్పద్రవ్యము దొరకినది. దీనినెట్లు మోసికొనిపోవుదును? పోని, మోసినంత దీసికొని పోదమనిన నిందున్నదానికై చింతగానుండును. ఎవ్వరినైనను సహాయము దీసికొని వత్తమన్న భాగమును గోరుదురు. ఏమి చేయుటకును దోచకున్నది. ఇదియునుం గాక యీ ధనమంతయుం జూడ నొక మహారాజుగారిదిగా నున్నది. ఇందుఁ బెక్కురత్న మండనములు గలిగియున్నవి. వారికిఁ దెలిసినచో నాపనిపట్టక మానరు అని పెక్కు తెరంగులఁ జింతించుచు నొకకత్తిచే నాదొంగల యంగంబులన్నియు ముక్కలుగా నరికి రాశిగాఁజేసి యాధనరాశి చుట్టును దిరుగుచు నేమిచేయుటకుఁ దోచక చింతించుచుండెను.

ఇంతలోఁ గొందఱు రాజభటు లాదొంగల వెదకుచు నాచెఱువునొద్దకువచ్చిరి. వారిఁ జూచి సోమశర్మ కొంచెము భయముజెంది యంతలో దనకు భగవంతుఁడిచ్చిన బుద్ధిబలముచేత ధైర్యము తెచ్చుకొని కత్తిచేతిఁ బూని పహరా యిచ్చువానివలె నాధనరాశి చుట్టును దిరుగుచుండెను. రాజకింకరులు రాజుగారి ధనమును చెట్టుక్రింద జూచి యానవాలుపట్టి సంతోషము జెందుచు సోమశర్మను సమీపముగాఁబోయి నీవెవ్వఁడవు? ఈ ధనంబేటికి దెచ్చితివని యడిగిన సోమశర్మయు మరల మీరెవ్వరు? మీరిచ్చటి కేల వచ్చితిరి అని యడిగెను.

ఆ మాటలువిని రాజభటుల సోమశర్మతో మేము భూరిశ్రవుఁడను రాజ కింకరులము. ఈ ధనము మా రాజుగారిది. మొన్నఁ గోటలో దొంగలుపడి దోచుకొని వచ్చిరి. వారిం బట్టుకొనుటకై వచ్చితిమి. దొంగలేమైరి. నీవీ ధనము నేటికిఁ గాచుచుంటివి. నిజము చెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

నేను సోమశర్మయను బ్రాహ్మంణుడను. నాకు దైవబలము గలిగియున్నది. భూతభవిష్యద్వర్తమానముల యందు జరుగుజర్యల జెప్పఁగలను. భూరిశ్రవునికోట దొంగలు దోచుకొనియెదరని తెలిసియే నిచ్చటికి వచ్చితిని నేను వచ్చువఱకు నీ ధనము దొంగలు పంచుకొనుచున్నారు. వారితో యుద్ధముచేసి కత్తులచే వాండ్రమేనులు తుత్తునుములు గావించి చంపితిని. అదిగో వారి శరీరఖండములు చూడుడు. మీ రందరు నశ్రద్ధగా నుండఁబట్టిగదా, దొంగలు కోటలోబడిరి? నేను రక్షింపనిచో నీపాటికి దొంగ లీధనమును బంచుకొనిపోవుదురు. దీనిని మిమ్ములను దీసికొనిపోనియ్యను.