పుట:కాశీమజిలీకథలు -01.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అప్పు డామె యేమియు లేక తెల్లబోయి చూచుచు నామాట మెల్లన జెప్పినది. సోమశర్మ భార్య నాక్షేపించుచు నీ మెడనున్న మంగళసూత్ర మమ్మి యఱిసెలు వండి యిమ్ము. నేను ధనము సంపాదించుకొనివచ్చి నీ మేనంతయు బంగారము జేసెదనని చెప్పెను. ఆ పతివ్రత మగనిమాట దాటక యప్పుడే తన మెడనున్న మంగళసూత్ర మమ్మి బెల్లము పిండియు నూనెయుఁ దెచ్చి యాలకులు, జాజికాయ, జాపత్రి మొదలగు వస్తువులు కొన్ని తెచ్చుట మరచి వాని దెచ్చుటకు గ్రమ్మర నంగడి కరిగి యా వస్తువు లిమ్మని యడిగెను. అప్పుడు కొంచెము చీకటి సమయము గాన నాకోమటి సందడిలో నందు జాజికాయకుఁ బదులుగా వసనాభిదుంప నిచ్చెను.

ఆ యిల్లాలు తెలియక దానిం గొనిపోయి నూరి పిండితోఁ గలిపి పెద్దవిగా నిరువదినాలుగఱిసెలను వండినది. వానిలో నొకటియైనను దానుదినక మూటఁగట్టి తెల్లవారుజామున నరుగునప్పుడు మగని కందించెను. ఆతం డామూట దీసికొని యూరువెడలి యడవిమార్గంబునం బడి జాముప్రొదెక్కువరకు నడిచెను. అందొక చెరువు గనంబడినంత నందు స్నానముచేసి యాయఱిసెలం దినఁదలంచి యామూట చెట్టుకొమ్మకుఁ దగిల్చి గుంటలో స్నానము చేయుచుండెను. ఇంతలో నిరువదినలుగురుదొంగలు విచ్చుకత్తులతో పారాలిచ్చుచు గాడిదెలమీఁదఁ బెక్కుధనమును తీసికొని వచ్చి యాచెఱువుగట్టుననున్న మఱ్ఱిచెట్టుక్రింద ధనమంతయు రాశిగాఁబోసి మిగుల నాకలిగా నుండుటచే నీరైనంద్రాగి యాకలి నడగించుకొనఁదలంచి గుంటలోనికిఁ బోయిరి.

సోమశర్మ యంతకుమున్నే వారిఁజూచి దొంగలని నిశ్చయించియు ధైర్యము విడువక వారి సంఖ్యదెలసికొని ముక్కు బట్టుకొని కన్నులుమూసికొని జపము చేయు చుండెను. ఆ దొంగ లతనిం జూచి యరచుచుఁ గత్తులందెచ్చి నరకబోయిరి. అందుల కతండు కొంచెమైనను జడియక యోబాబులారా! యూరక నన్నేల చంపెదరు ? నేను జ్యోతిష్కుఁడను. మీరిచ్చటికి వత్తురనియు నాకలి గలిగియుందు రనియుఁ దెలిసికొని లెక్కబెట్టి మీరుఁ దిన సరిపడిన యరిసెలం దెచ్చితిని. మీరాక కెదురుచూచుచుంటిని అదిగో అఱిసెలమూట నా చెట్టుకొమ్మం దగిలించితి జూచుకొనుఁడని పలికిన నందొకఁడు ఆమూటనువిప్పి చూచిన నం దిరువదినాలుగే అఱిసెలున్నవి. వానింజూచి యతని దైవజ్ఞత్వమున కాదొంగలు ఆశ్చర్యపడుచు నతని జంపక బహుమానము జేయఁదలఁచి యతని దమ గురువుగా నుండుమని చెప్పిరి. పిమ్మట నాదొంగలందరు నాచెఱువులో స్నానము చేసి కత్తులన్నియుఁ బ్రోగుగాఁ బెట్టి యాబ్రాహ్మణుఁడు తెచ్చిన యఱిసెల నిరువద నలుగురు వంత ప్రకారం దిని నీరు త్రాగి యాబ్రాహ్మణుఁడనే కాపుంచి యాచెట్టుక్రిందఁ పండుకొని నిద్రపోయిరి. అంత నాయఱిసెలలోనున్న