పుట:కాశీమజిలీకథలు -01.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమశర్మ కథ

221

కట్టుగుడ్డలతో నా దంపతుల నెక్కడికేని బొండని విడిచివేసిరి. ఆ దంపతులు ఉజ్జయనీపురము విడిచి మధ్యాహ్నమున కొక యగ్రహారము జేరిరి. విక్రమార్కుండు భట్టియు నతని యదృష్టమును బరీక్షింపఁ బ్రచ్ఛన్నముగా వారివెంట నరుగుచండిరి.

అట్లామిథున మా యగ్రహారమున నెవ్వని యింటికిఁబోక యొక గృహస్థుని వీథి యరుగుమీఁద నిలువంబడెను. వారుచేరిన యొక నిముషమునకే నాలుగు దినముల నుండి ప్రసవము కానేరక నొప్పులు పడుచున్న యా గృహస్థుని భార్య సులభముగ నీళ్ళాడెను. అదిచూచి యజమానుఁడు మిగుల సంతసించుచు నాదంపతులు వచ్చుట చేతనే తనకా శుభము గలిగినదని నిశ్చయించి వారికి మిగుల మర్యాదజేసి పిండివంటలతో భోజనముపెట్టి చీనాంబరములు గట్ట నిచ్చుటయేగాక వారి రాక శుభప్రదమని యూరంతయుఁ జాటించెను

ఆ వార్తవిని యా యూరనే వేరొక గృహస్థుని భార్యయు నట్టి చిక్కునే పొందియుండ నాయజమానుఁడు నాదంపతులను పల్లకీమీద నూరేగింపుచుఁ దన యింటికిఁ దీసికొనిపోయెను, వారి పాదమెట్టిదో కాని వా రిల్లుచేరిన వెంటనే ఆ యిల్లాలును సుపుత్రునిం గనినది, అప్పుడా యజమానుఁడు పట్టరాని వేడుకతో నాదంపతులను బార్వతీపరమేశ్వరులని భావించి విచిత్ర భూషాంబరములతో నలంకరించి పూజింపుచుఁ గొన్నిదినములు తనయింట నుంచుకొనెను.

క్రమంబున వారిఖ్యాతి జగద్విదితమైనది. ఎవరి కేచిక్కులు తటస్థించినను వారిం తీసికొనిపోయిన తక్షణమే నివారణమగుచుండెను. వారి నొక్క పూటకన్న నెక్కడను నిలువనీయక పల్లకీలఁబంపి యుత్సవములు చేయుఁచుదీసికొని పోవు చుందురు వారికిచ్చు ధనమునకు నగలకును బట్టలకును మితిచెప్పుటకు వీలులేదు. వారిస్థితి నిత్యకళ్యాణము పచ్చతోరణముగా నున్నది. వారి దర్శనమునకై యనేకగ్రామములనుండి జనులు వచ్చి వేచియుందురు. ఈరీతి గొన్నిదినములు దేవతావైభవములు జరిగినంత నొక్కనాఁడు పల్లకి యెక్కి యూరేగుచు నొకయూరినుండి యొకపట్టణమునకుఁ బోవుచుండ నొకయేనుఁగు వచ్చి యావిప్రుని మెడయందుఁ బూవులదండవైచి బంగారుకలశముతో నుదక మభిషేకము చేసినది.

పుత్రశూన్యుఁడగు రాజు చనిపోయినప్పుడు ఏనుఁగచే వరింపఁబడినవానినే రాజుగాఁ జేసిగొనుట యాదేశసాంప్రదాయకము గాన నచ్చటి ప్రజలెల్ల నాబ్రాహ్మణునే రాజుగాఁ భావించి శుభముహూర్తమున బట్టాభిషేకము జేసిరి. అదియంతయుఁ బ్రచ్ఛన్నముగానుండి చూచుచున్న భట్టివిక్రమార్కులు పురుషుని భాగ్యము స్త్రీమూలముగనే కలుగునని నిశ్చయించిరి. అతండు తమకన్న గొప్పరాజు గావున వినయముతో నతనియొద్దకుఁబోయి చేసిన విధానమంతయఁ దెలియఁజేయుటయు నాబ్రాహ్మణుఁడు మిగుల సంతసించుచు గృతజ్ఞత సూపుచు వారిఁ బెక్కుగతులఁ బూజించెను.

భట్టివిక్రమార్కులును తమచేసిన కృత్యము ఫలించెనని సంతసించి తమ దేశమున కరిగిరి. కావున నాతీ! నీతోఁ గొన్నిదినములు విడిపోయి నేను దేశాంతర మరిగి ధనము సంపాదించుకొనివచ్చెదను. నాకు దారిభత్యమేమైన నిమ్మని సోమశర్మ భార్య నడిగెను.